
Pension : తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇటీవల చేపట్టిన సమగ్ర పెన్షన్ల వెరిఫికేషన్ (Pension Verification) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ క్షేత్రస్థాయి తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూడటంతో అధికారులు ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను రద్దు చేశారు. అయితే, ఇదే సమయంలో నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూరుస్తూ 48 వేల మంది కొత్త అర్హులతో కూడిన సరికొత్త జాబితాను కూడా అధికారులు సిద్ధం చేశారు.
వివిధ రకాల పెన్షన్ల విషయంలో పారదర్శకత కోసం జరిపిన విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మృతుల పేరుతో ఇంకా పెన్షన్లు డ్రా చేస్తుండటం, సుదీర్ఘకాలంగా అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి అధికారులు తొలగించారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్న వారిపై కూడా వేటు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న సంపన్నులు, ఆదాయపు పన్ను (Income Tax) చెల్లిస్తున్న వారిని గుర్తించి వారి పెన్షన్లను తక్షణమే కట్ చేశారు. కాగా, రద్దయిన మొత్తం 1.28 లక్షల పెన్షన్లలో అత్యధికంగా 1.02 లక్షల పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా.. మిగిలినవి పట్టణ, మున్సిపాలిటీల పరిధిలోనివని అధికారులు వెల్లడించారు.
అనర్హుల తొలగింపు ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం తగ్గడమే కాకుండా, నిజమైన అర్హులకు మార్గం సుగమమైంది. అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాల వల్ల ఇంతకాలం పెన్షన్లు రాని 48 వేల మంది వికలాంగులు (దివ్యాంగులు), వితంతువుల పేర్లతో అధికారులు ఒక ప్రత్యేకమైన కొత్త జాబితాను సిద్ధం చేశారు. ఈ నూతన లబ్ధిదారుల జాబితా ప్రస్తుతం తుది అనుమతుల కోసం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే, ఈ కొత్త లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. తద్వారా రాబోయే నెల నుంచే వీరికి నేరుగా ఆర్థిక సాయం అందనుంది.









