
Strait Of Hormuz : హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ మాది అంటే మాది అని రెండు దేశాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఇరాన్‌కు షాక్ ఇస్తూ ట్రంప్ కీలక ఫోటో విడుదల చేశాడు. తద్వారా హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకే ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. అందులో భాగంగా ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘హర్మూజ్.. అమెరికా కొత్త ప్రదేశం’ అని ఆ జలసంధి మ్యాప్‌పై రాసి ఉన్న ఓ ఫొటోను ట్రంప్ షేర్ చేశారు. ప్రస్తుతం అమెరికా హర్మూజ్‌ను దిగ్బంధనం చేయడంతో పాటు.. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు హర్మూజ్‌పై పట్టును కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. ‘‘ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తేవేయాలి. స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. చమురుపై ఆంక్షలను తొలగించాలి. అదేవిధంగా సైనిక చర్యలకు ముగింపు పలకాలి. అప్పటివరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోం’’ అని ఆయన తేల్చి చెప్పారు.
Also Read : పాక్, టర్కీలతో ఒప్పందం ఉన్నా వేస్ట్.. సౌదీ నౌకలపై హూతీల దాడులు.. అసలేం జరిగింది?
వాణిజ్య నౌకపై దాడి
రెండు దేశాల పరిస్థితి ఇలా ఉండగా హర్మూజ్ జలసంధిలో మంగళవారం ఓ వాణిజ్య నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ నౌకను ఢీకొట్టడంతో ఇంజిన్ రూమ్ పూర్తిగా ధ్వంసమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ (UKMTO) వివరించింది. నౌకలోని మిగతా సిబ్బందిని కాపాడేందుకు ఒమన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగినట్లు వెల్లడించింది. దాడి ఎవరు చేశారనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఈ దాడి చోటుచేసుకోవడం కలకలం రేపింది. హర్మూజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ (Iran) సైనిక దళాల నియంత్రణలోనే ఉందని ఇటీవల ఆ దేశ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి తేల్చి చెప్పారు. ఇరాన్ నిర్దేశించిన నిబంధనలు, ముందస్తు అనుమతి లేకుండా ఏ నౌక కూడా జలసంధిని దాటలేదని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే వాణిజ్య నౌకపై దాడి జరగడం చర్చనీయంశమైంది.
కాగా ఇరాన్, అమెరికా యుద్ధం మొదలు కాకముందు ప్రపంచ ముడిచమురు, సహజవాయువు రవాణాలో దాదాపు ఐదో వంతు హర్మూజ్ జలసంధి మీదుగానే సాగుతుండేది. ప్రస్తుతం నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయను చెప్పాలి. ఆదివారం కేవలం మూడు నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read : ఒకే నంబర్‌తో ఒకే రూట్‌లో రెండు విమానాలు.. ఆమెరికాలో తప్పిన ఘోర ప్రమాదం!









