pakistan

Pakistan :  ఇండియా రక్షణ వ్యవస్థ రోజురోజుకూ తన బలాన్ని పెంచుకుంటుంది. లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీతో దూసుకుపోతుండడం చూసి పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో వణుకు మొదలైంది. తక్కువ ఖర్చుతో కూడిన చిన్న చిన్న డ్రోన్లు, క్వాడ్‌కాప్టర్లు, ఆత్మహుతి డ్రోన్లు ద్వారా భారత్ ఎక్కడ తమ సైనిక స్థావరాలపై అటాక్ చేస్తుందోననే తీవ్ర భయాందోళనల మధ్య పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యం లోనే భారత్‌కు భయపడి, తన ఎయిర్ డిఫెన్స్ ను కాపాడుకోవడానికి టర్కీ దేశానికి చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీ అసెల్సాన్ తయారు చేసిన షాహీన్ 40mm కౌంటర్-UAS అనే యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ను పాకిస్థాన్ రంగంలోకి దించింది. డిఫెన్స్ లీకుల ప్రకారం పాక్ ఆర్మీ ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసినట్లు అర్థమవుతోంది.

ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాలలో చిన్న చిన్న డ్రోన్లు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో చూసిన పాక్ మిలిటరీ ప్లానర్లు, భారత్ వైపు నుండి వచ్చే ఇలాంటి ముప్పును తట్టుకోవడం తమ వల్ల కాదని తేల్చేసుకున్నారు. ఎందుకంటే లక్షల రూపాయల విలువైన పెద్ద పెద్ద మిస్సైళ్లతో చిన్న డ్రోన్లను కొట్టడం ఎకనామికల్‌గా పాకిస్థాన్‌ను పూర్తిగా ముంచేస్తుంది. అందుకే చాలా తక్కువ కాస్ట్‌తో భారత్ డ్రోన్లను కూల్చేయడానికి ఈ షాహీన్ డ్రోన్ కిల్లర్ వైపు మొగ్గు చూపారు. ఈ సరికొత్త హార్డ్-కిల్ సిస్టమ్ ద్వారా తమ ఎయిర్ బేస్‌లు, నేవీ కేంద్రాలు, మందుగుండు డిపోలు, అండ్ బోర్డర్ సెక్యూరిటీ ప్రాంతాలను కాపాడుకోవాలని పాక్ చూస్తోంది. ముఖ్యంగా భారత ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అండ్ జామింగ్ సిస్టమ్స్‌ను తట్టుకుని ఆటోమేటిక్‌గా దూసుకువచ్చే డ్రోన్లను నాశనం చేయడానికి ఈ కంటిన్యూస్ డిఫెన్స్ వారికి అవసరమైంది.

సాంకేతికంగా చూస్తే ఈ షాహీన్ సిస్టమ్ సుమారు 2500 కిలోల బరువుంటుంది. దీనిని ఒక వెహికల్‌కు కనెక్ట్ చేసి ఎక్కడికైనా ఈజీగా షిఫ్ట్ చేయవచ్చు. ఇది చుట్టూ 360 డిగ్రీలు తిరుగుతూ, మైనస్ 10 డిగ్రీల నుండి ప్లస్ 60 డిగ్రీల ఎత్తు వరకు వచ్చే డ్రోన్లను గురి పెట్టగలదు. దీని మెయిన్ ఆయుధం 40mm ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్. ఇందులో అసెల్సాన్ కంపెనీకి చెందిన ఆటమ్ 40mm అనే 64 ప్రోగ్రామబుల్ ఎయిర్‌బర్స్ట్ స్మార్ట్ మందుగుండు సామాగ్రి ఉంటుంది. డ్రోన్ ఎంత స్పీడ్‌గా కదిలినా లేదా ఒకే చోట హోవర్ అవుతూ ఉన్నా, దీని ఫైర్ కంట్రోల్ యూనిట్ క్షణాల్లో క్యాలిక్యులేషన్స్ వేసి, ఆ డ్రోన్ దగ్గరకు వెళ్లగానే బ్లాస్ట్ అయ్యేలా గ్రెనేడ్‌ను లాంచ్ చేస్తుంది. గాల్లో ఈ గ్రెనేడ్ పేలినప్పుడు వచ్చే పదునైన శకలాల మేఘం ఆ చిన్న డ్రోన్లను ముక్కలు ముక్కలు చేస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వెదర్‌లోనైనా ఆటోమేటిక్‌గా టార్గెట్‌ను గుర్తించే కెమెరాలు, అండ్ రేడార్ కనెక్టివిటీ దీనికి ఉన్నాయి. దీని ద్వారా 700 మీటర్ల రేంజ్‌లో వచ్చే శత్రు డ్రోన్లను ఇది సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకోగలదు.

ఒక్క సిస్టమ్‌తోనే ఆగిపోలేదు

అయితే పాకిస్థాన్ కేవలం ఈ ఒక్క సిస్టమ్‌తోనే ఆగిపోలేదు. భారత్ సైనిక శక్తిని చూసి భయపడుతూ, గత కొన్ని ఏళ్లుగా టర్కీతో డిఫెన్స్ డీల్స్‌ను విపరీతంగా పెంచేసుకుంటోంది. ఇప్పటికే 2022 నుండి దాదాపు 24 వరకు బైరక్టార్ TB2 సాయుధ డ్రోన్లను పాక్ ఆర్మీ, అండ్ ఎయిర్‌ఫోర్స్‌లో వాడుతోంది. ఆ తర్వాత 2023 లో మరింత ఎక్కువ వెయిట్‌ను, మిస్సైళ్లను మోసుకెళ్లగల 6 నుండి 7 బైరక్టార్ అకింసి భారీ డ్రోన్లను కూడా టర్కీ నుండి తెప్పించుకుంది. కేవలం గాల్లోనే కాకుండా నావికా దళంలో కూడా మిల్గెమ్ క్లాస్ యుద్ధనౌకల తయారీ కోసం కరాచీ షిప్‌యార్డ్‌లో టర్కీ టెక్నాలజీతో పనులు చేపట్టింది. అమెరికా, చైనా లేదా రష్యాలపైనే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా, టర్కీ ఒక మెయిన్ పార్ట్‌నర్‌గా చేసుకుని పాకిస్థాన్‌లోనే ఈ డ్రోన్ల అసెంబ్లింగ్ ప్లాంట్లను పెట్టాలని, భవిష్యత్తులో స్టెల్త్ డ్రోన్లను తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాదు టర్కీ నిర్మిస్తున్న 5వ తరం యుద్ధ విమానం కాన్ ప్రాజెక్టులో చేరడానికి కూడా పాక్ ఆరాటపడుతోంది.

భారత్‌తో ఏ క్షణంలోనైనా ముప్పు రావచ్చు అనే భయంతో పాకిస్థాన్ రక్షణతో పాటు ఎటాక్ చేసే స్ట్రాటజీలను కూడా సమాంతరంగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా జూన్ 2026 లో టర్కీకి చెందిన గజాప్ అనే థర్మోబారిక్ ఏరియల్ బాంబులను కూడా పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఈ డేంజరస్ గజాప్ బాంబులను పాక్ తన ఎఫ్-16 (F-16) ఫైటర్ జెట్లకు అమర్చుతోంది. బంకర్లు, భూగర్భ సైనిక స్థావరాలు, పటిష్టమైన కోటలాంటి రక్షణ గోడలను క్షణాల్లో బూడిద చేయడానికి ఈ థర్మోబారిక్ ఆయుధాన్ని వాడుతారు. ఒకవైపు భారత్ డ్రోన్లను ఎదుర్కోవడానికి షాహీన్ కౌంటర్ సిస్టమ్ లాంటి రక్షణ కవచాన్ని కొంటూనే, మరోవైపు గజాప్ బాంబులతో దాడి చేసే కెపాసిటీని పెంచుకుంటూ పాకిస్థాన్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ డిఫెన్స్ డీల్స్ వల్ల టర్కీకి పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్, అండ్ ఇండో-పసిఫిక్ రీజియన్‌లో పొలిటికల్ పట్టు దొరుకుతుండగా, పాకిస్థాన్ మాత్రం భారత్‌కు భయపడి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తుర్కీయె కాళ్ల దగ్గర భారీగా నిధులు కుమ్మరిస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.