Crime News : మిర్యాలగూడ కలాల్‌వాడలో ఈ నెల 5న జరిగిన ముగ్గురు సజీవ దహనం కేసు ఊహించని మలుపు తిరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన.. పక్కా స్కెచ్‌తో జరిగిన దారుణ హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది.

జూన్ 5న మిర్యాలగూడలోని కలాల్‌వాడలో సిలిండర్ పేలి వనం చంద్రకళ (అమ్మమ్మ), లక్ష్మణ్ (మనుమడు), ప్రణీత (మనుమరాలు) సజీవ దహనమయ్యారు. ప్రారంభంలో షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలి ఉంటుందని భావించినప్పటికీ, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల కుటుంబ నేపథ్యంపై దృష్టి సారించారు.మృతురాలు చంద్రకళ కూతురైన ధనమ్మకు గతంలో భర్త చనిపోగా, ఆమె శిరీష్ కుమార్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అయితే, కొంతకాలంగా భర్తతో వచ్చిన తీవ్ర మనస్పర్థలు, కుటుంబ కలహాల కారణంగా ధనమ్మ అతడిని వదిలేసింది. ప్రస్తుతం ఆమె పూణెలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ధనమ్మ అత్తగారి కుటుంబంపై కక్ష పెంచుకున్న శిరీష్ కుమార్.. చంద్రకళ, ఆమె మనవడు, మనవరాలిని వదిలించుకుంటే తనకు అడ్డు తొలగిపోతుందని భావించాడు.

హత్యకు నెల రోజుల ముందు నుంచే నిందితుడు శిరీష్ కుమార్ పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. జూన్ 5న అర్ధరాత్రి చంద్రకళ, లక్ష్మణ్, ప్రణీత నిద్రిస్తున్న సమయంలో శిరీష్ కుమార్ గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించాడు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటలు అంటించాడు. బాధితులు ప్రాణరక్షణ కోసం బయటకు రాకుండా ఉండేందుకు ఇంటికి బయటి వైపు నుంచి గడియ పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. లోపల మంటలు వేగంగా వ్యాపించడంతో, బయటకు వచ్చే దారి లేక ఆ ముగ్గురు సజీవ దహనమయ్యారు.

నిందితుడి కదలికలు, గత నెల రోజులుగా అతడి ఫోన్ కాల్ డేటా (CDR) మరియు టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు నిందితుడు శిరీష్ కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలను, కేసు పురోగతిని పోలీసులు నేడో రేపో అధికారికంగా మీడియా వేదికగా వెల్లడించే అవకాశం ఉంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.