
IT : రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అత్యంత కీలకమైన వర్షాల అడ్వైజరీని జారీ చేసింది. రోడ్లపై ట్రాఫిక్ జాంలు, వరద నీరు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ముందే ఇళ్లకు పంపించాలని పోలీసులు కోరారు.
సైబరాబాద్ పరిధిలోని ఉద్యోగులకు అలెర్ట్
సాయంత్రం భారీ వర్షం ఉన్నందున ఉద్యోగులు త్వరగా ఇంటికి వెళ్ళాలని పోలీసుల సూచన pic.twitter.com/SFYJK1ASVp
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2026
సాధారణంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల సమయంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలోనే భారీ వర్షం పడితే రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. అందుకే ఆఫీస్ ముగిసే సమయానికి అందరూ ఒకేసారి రోడ్లపైకి రాకుండా, మధ్యాహ్నం విడతల వారీగా ఉద్యోగులను ఇళ్లకు పంపించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఐటీ సంస్థలతో పాటు విద్యాసంస్థలు కూడా విద్యార్థులను ముందే ఇళ్లకు పంపించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అందరూ ఒకేసారి కాకుండా ముందే ఇళ్లకు బయలుదేరడం వల్ల మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయే పరిస్థితి తప్పుతుంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 24 వరకు నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వానతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అంతేకాకుండా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో జూన్ 27 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.









