Strait of Hormuz : అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు ,గ్యాస్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో, దానిని తిరిగి తెరవడానికి మధ్యవర్తుల ద్వారా అమెరికా ముందు మూడు ప్రధాన షరతులను ఉంచింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ షరతులను ప్రతిపాదించారు.
షరతులు ఇవి…
అమెరికా ఆంక్షల ఎత్తివేత: ఇరాన్ చమురు ఎగుమతులపై మరియు ఆర్థిక వ్యవస్థపై అమెరికా విధించిన ఆంక్షలను (blockade) పూర్తిగా ఎత్తివేయాలి.
ప్రాంతీయ భద్రతలో జోక్యం తగ్గించడం: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ,దాని మిత్రదేశాల సైనిక ఉనికిని తగ్గించడం. ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
అణు ఒప్పందంపై చర్చలు: ఇరాన్ అణు కార్యక్రమం (Nuclear Programme) పై ఉన్న ఆంక్షలను తొలగించి, 2015 నాటి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందాన్ని గౌరవించాలి.
ఈ షరతులు నెరవేరితేనే ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను సురక్షితంగా కొనసాగించడానికి అంగీకరిస్తుందని, లేని పక్షంలో జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేసింది
అయితే, ఇరాన్ పెట్టిన ఈ షరతుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఆయన జాతీయ భద్రతా బృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ ససేమిరా అంగీకరించడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని, అణు అంశాన్ని చేర్చని ఏ ఒప్పందానికైనా తావులేదని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇరాన్ ఈ పద్ధతిలో చర్చల నుండి తప్పించుకోవాలని చూడటం సాధ్యం కాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా తేల్చి చెప్పారు.
ప్రస్తుతానికి వైట్ హౌస్ ఈ ప్రతిపాదనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం అణు శుద్ధి ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించుకుంది. మీడియా ద్వారా చర్చలు జరపడం తమ విధానం కాదని, అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ ప్రయోజనాలకు మేలు చేసే ఒప్పందాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నామని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వెల్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధ తయారీ దిశగా వేగంగా పురోగమించకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడమే తమ ప్రాధాన్యత అని అమెరికా అధికారులు పునరుద్ఘాటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి ఎప్పుడు తెరుచుకుంటుందనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, కనీసం చర్చల కోసం ఒకే వేదికపైకి రావడానికి కూడా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ట్రంప్ గతంలో ఇరాన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడవచ్చని సూచించినప్పటికీ, అణు ఒప్పందంపై ఇరాన్ మొండి వైఖరి ప్రస్తుత ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైంది. ఈ దౌత్యపరమైన చిక్కుముడి వీడే వరకు ప్రపంచ ఇంధన మార్కెట్లో ధరల పెరుగుదల, సరఫరా అంతరాయాలు కొనసాగే ప్రమాదం ఉంది.







