Saudi Aramco Helicopter Crash
Saudi Aramco Helicopter Crash

గత కొద్ది నెలలుగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. ఇప్పుడు అక్కడ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాజాగా ఆ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Saudi Aramco Helicopter Crash

పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న కీలక ప్రపంచ చమురు కేంద్రం ‘రాస్ తనూరా’లో సౌదీ అరామ్‌కోకు చెందిన హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య కారణంగా అదుపుతప్పి నేలకూలింది. ప్రమాదం సమయంలో ఆ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది సిబ్బంది ఉండగా.. వారంతా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారందరూ సౌదీ జాతీయులే అని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

కాగా ఈ ‘రాస్ తనూరా’ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్. ఇటీవల అమెరికా – ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల పాటు ఈ రాస్ తనూరా కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ మధ్యనే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో.. రెండు రోజుల క్రితం అంటే శుక్రవారం దీనిని పునఃప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం గమనార్హం.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.