CM Revanth Reddy
CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించి సుమారు రూ.13వేల కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. అలాగే కనగల్ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన ఆయన.. నల్గొండ కార్పొరేషన్‌లో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు, అలాగే రూ.83 కోట్లతో మొదటి దశ తాగునీటి శుద్ది కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్‌జీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వందల మంది ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణను సాధిస్తే బీఆర్ఎస్‌ వాళ్లు ఆ త్యాగాలను తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకున్నారని మండిపడ్డారు. వంద రూపాయల పెట్రోల్ పోసుకున్న అగ్గిపెట్టెరావుది త్యాగం కాదని చెబుతూ.. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ పరోక్షంగా హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ వందేళ్ల విధ్వంసం చేసిందని అన్నారు.

ఈ మేరకు కేటీఆర్, హరీశ్ రావును ఉద్దేశించి.. తెలంగాణలో తోడేళ్లలా ఇద్దరు తిరుగుతున్నారంటూ ఫైరయ్యారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఏ ఒక్క మహిళకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని తీవ్రంగా ఆరోపించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి చూసే ప్రజలు బుద్ది చెప్పి.. ఆ కుటుంబాన్ని బహిష్కరించారని అన్నారు. మళ్లీ వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలను పట్టించుకోకుండా.. ఫామ్ హౌస్‌లు కట్టుకుని లగ్జరీ లైఫ్ అనుభవించారని విమర్శించారు.

తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కేవలం 30 నెలల్లోనే రైతులను ఆదుకుని దన్నుగా నిలిచామని.. వారి ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లు జమచేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి గతమే కాని ఎలాంటి భవిష్యత్తు లేదని, ఉండదని తెలిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. తమ రెండున్నరేళ్ల పాలన.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని అన్నారు. అలాగే ‘‘ఒట్టేసి చెబుతున్నా.. మూసీ పూర్తి చేసి తీరుతా.. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డు పడినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, మూసీలేసి తొక్కుతా.. మూసీ నది ప్రక్షాలన చేస్తా’’ అని పేర్కొన్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.