
CM Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి నేటితో (2026 జులై 4) సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం, అంటే 2006 జులై 4న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక సామాన్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఘనవిజయం సాధించారు. ఎటువంటి బలమైన రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం తన పోరాట పటిమతో ఒక జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి అయిన ముఖ్యమంత్రి పీఠం వరకు ఆయన చేరుకున్న తీరు అద్వితీయం.
తన రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో రేవంత్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను, మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ, విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజలతోనే తన అనుబంధాన్ని కొనసాగించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, నేడు తెలంగాణను శాసించే స్థాయికి ఎదిగారు.
మిడ్జిల్ గడ్డపై ‘కృతజ్ఞతా యాత్ర’
తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసిన మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం (జులై 4) ఒక ప్రత్యేక భావోద్వేగ పర్యటన చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో తాను మొదట గెలిచిన ప్రాంతానికి వెళ్లడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ పర్యటనను కేవలం ఒక అధికారిక కార్యక్రమంగా కాకుండా, తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే ‘కృతజ్ఞతా యాత్ర’గా ఆయన మార్చుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఆ ప్రాంత సమగ్ర వికాసం కోసం రేవంత్ రెడ్డి సుమారు రూ.350 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా ఆయన తొలుత నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలోని సుప్రసిద్ధ ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు స్వయంగా భూమి పూజ చేశారు.
పాత మిత్రులతో మధ్యాహ్న భోజనం
రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో, తను జడ్పీటీసీగా ఉన్న కాలంలో అండగా నిలిచిన నాటి అనుచరులు, సీనియర్ నేతలు, స్థానిక పెద్దలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఊర్కొండలో వారందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ, గడిచిన 20 ఏళ్ల నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి కష్టసుఖాలను పంచుకుంటూ, తన ఎదుగుదలకు కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మిడ్జిల్ మండలం వెలిజాల ఎక్స్‌రోడ్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ దివంగత సీనియర్ నేత గోపాల్‌రెడ్డి విగ్రహంతో పాటు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సభకు పాలమూరు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.
కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా..
రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి పరిధిలోని కొండారెడ్డిపల్లి అనే సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మల కుమారుడైన రేవంత్.. హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఏబీపీవీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు.రాజకీయాల్లోకి రాకముందు రియల్ఎస్టేట్ వ్యాపారంతో పాటు జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి (నాటి TRS) లో చేరి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల దక్కలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా స్వతంత్రుడిగా మిడ్జిల్ జడ్పీటీసీగా బరిలోకి దిగి, నాటి కాంగ్రెస్ హవాను తట్టుకుని గెలిచారు.
నాడే చెప్పిన ‘సీఎం’ విజన్
జడ్పీటీసీగా గెలిచిన ఏడాదికే, అంటే 2007లో స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్ శాసనమండలి (MLC) ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్రుడిగా గెలిచి అసెంబ్లీ భవనంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2008లో నాటి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం (TDP) లో చేరారు. ఆ సమయంలో తనతో పాటు బెంచ్‌ను పంచుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో.. “నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను” అని రేవంత్ అన్నారట. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకముందే ఆయనకు ఉన్న ఆ విజన్, పట్టుదల నేడు నిజమవడం విశేషం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు. అసెంబ్లీలో నాటి అధికార పక్షంపై ఆయన చేసిన వాడి వేడి విమర్శలు రేవంత్ రెడ్డిని అగ్రనాయకుడిగా నిలబెట్టాయి.
ఓటుకు నోటు కేసు.. తీవ్ర ఒడిదొడుకులు
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత కఠినమైన కాలం 2015లో ఎదురైంది. ‘ఓటుకు నోటు’ కేసులో ఆయన అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం సమయంలోనే జైలుకు వెళ్లాల్సి రావడం ఆయనను వ్యక్తిగతంగా ఎంతో కుంగదీసింది. అయినా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత పట్టుదలతో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేశారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2017లో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తనను పాతాళానికి తొక్కేయాలని చూసిన ప్రత్యర్థులకు సమాధానం చెబుతూ.. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
టీపీసీసీ పగ్గాలు.. అంతర్గత విభేదాల అధిగమనం
రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం 2021లో ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ, జూనియర్ అయిన రేవంత్‌కు పగ్గాలు ఇవ్వడం పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలకు దారితీసింది. సొంత పార్టీ నేతలే ఆయనను బహిరంగంగా విమర్శించినా, వాటన్నింటినీ భరిస్తూ, అందరినీ కలుపుకుంటూ కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ నింపారు.ఆయన ముందున్న ఏకైక లక్ష్యం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం. ఇందుకోసం అవమానాలను భరించారు, ఆవేశాన్ని పక్కనబెట్టి ఆలోచనతో అడుగులు వేశారు. ‘దేశమే ప్రథమం.. ప్రజా సంక్షేమమే పరమావధి’ అనే నినాదంతో ముందుకు సాగారు. ఫలితంగా 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని విజయం సాధించి, కేసీఆర్ దశాబ్ద కాల పాలనకు చరమగీతం పాడింది. రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
‘రేవంతన్న’గా ప్రజల గుండెల్లో..
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రజలతో ఉన్న సంబంధాలను వీడలేదు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయన్ను ఆప్యాయంగా “రేవంతన్న” అని పిలుచుకుంటారు. వెనుకబడిన పాలమూరు జిల్లా నుంచి వచ్చిన ఆయన.. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్‌ను కొత్త విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సంపన్న ప్రాంతంగా మార్చడమే తన దార్శనికత అని తరచుగా చెబుతుంటారు. పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూనే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నిధులను రాబడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని “పెద్దన్న”గా సంబోధిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మద్దతును నిరంతరం కోరుతున్నారు. 20 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకమని, ప్రతి సంఘర్షణలో తనతో నడిచిన ప్రజలు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రేవంత్ రెడ్డి ఎక్స్‌లో భావోద్వేగంగా పోస్ట్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక సేవకుడిగా నిరంతరం శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.









