PM Modi :  అమెరికా చారిత్రాత్మక 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, అక్కడి ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆయన ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

భారత్, అమెరికాల మధ్య కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యమే కాకుండా, అంతకుమించిన బలమైన బంధం ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలనపై మనకున్న ఉమ్మడి నమ్మకం.. అలాగే ఇరు దేశాల ప్రజల అపరిమితమైన ప్రతిభ మన స్నేహాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే ఒక గొప్ప శక్తిగా మార్చాయి. రాబోయే 250 ఏళ్లు అమెరికాకు మరింత శ్రేయస్సు, శాంతి, ప్రగతిని తీసుకురావాలని.. భారత్-అమెరికా బంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

ఈ మైలురాయిని పురస్కరించుకుని అమెరికా 250 ఇనిషియేటివ్ పేరుతో భారతదేశంలోని యూఎస్ ఎంబసీ ఒక ప్రత్యేక వీడియోను పంచుకుంది. భారత్-అమెరికా మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ వీడియోలో చూపించారు. ఇటీవల జరిగిన జీ7 (G7) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కరచాలనం చేసుకున్న విజువల్స్ ఇందులో హైలైట్‌గా నిలిచాయి.

ఈ వీడియో సందేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. “భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అమెరికా అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం” అని ఇరు దేశాల గొప్పతనాన్ని చాటారు. ఈ ప్రత్యేక వీడియోలో క్రీడలు, కళలు, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖ భారతీయ ఐకాన్స్ సందేశాలను కూడా చేర్చారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.