
Macron : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చారిత్రాత్మక సిరియా పర్యటనలో ఉండగా.. రాజధాని డెమారస్కాస్ నగరం వరుస బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన బస చేసిన ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలోనే ఈ పేలుళ్లు సంభవించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాక్రాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో అధికారిక చర్చల్లో పాల్గొంటున్నారు. ఆయన సురక్షితంగా ఉన్నారని, షెడ్యూల్ ప్రకారం సమావేశాలు కొనసాగుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం వెంటనే ప్రకటించింది. ఈ దాడుల్లో దాదాపు 18 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
నడిబొడ్డున ఉన్న పర్యాటక శాఖ కార్యాలయం, జాతీయ మ్యూజియం సమీపంలోని ఒక రద్దీ వీధిలో ఈ రెండు పేలుళ్లు జరిగాయి. వీటిలో ఒక బాంబును చెత్తబుట్టలో, మరొకదాన్ని పార్క్ చేసి ఉన్న కారులో అమర్చినట్లు సిరియా భద్రతా అధికారులు గుర్తించారు. మొదటి పేలుడు జరిగిన వెంటనే సహాయక చర్యల కోసం వచ్చిన అంబులెన్స్ సమీపంలోనే రెండో పేలుడు కూడా సంభవించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో.. పేలుడు ధాటికి ఒక వ్యాన్, బైక్ పూర్తిగా తగలబడిపోవడం, వీధులన్నీ దట్టమైన నల్లటి పొగతో నిండిపోవడం కనిపించింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. కొన్ని రోజుల క్రితమే డెమారస్కాస్ కోర్టు సమీపంలోని ఒక కేఫ్‌లో జరిగిన బాంబు దాడిలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
2024 లో తిరుగుబాటు ద్వారా బషర్ అల్-అస్సాద్ సుదీర్ఘ క్రూర పాలనకు అంతం పలికి, కొత్తగా అధికారంలోకి వచ్చిన అహ్మద్ అల్-షరా ప్రభుత్వానికి ఈ వరుస పేలుళ్లు ఒక పెద్ద సవాలుగా మారాయి. గతంలో అల్-ఖైదాతో సంబంధాలున్న సంస్థకు నాయకత్వం వహించిన షరా.. ఇప్పుడు ప్రజాస్వామ్య సంస్కరణల ద్వారా వెస్ట్రన్ దేశాల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2024 తర్వాత సిరియాను సందర్శిస్తున్న మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ పెద్ద నాయకుడు మాక్రాన్ కావడం గమనార్హం. గతంలో సిరియాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను తొలగించడంలో మాక్రాన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధం తర్వాత ధ్వంసమైన సిరియా పునర్నిర్మాణం కోసం ఫ్రాన్స్‌కు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థలతో కలిసి ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపట్టారు.
ఈ పేలుళ్ల తీవ్రత సిరియాలో ఇంకా శాంతిభద్రతల సమస్యలు పూర్తిగా సద్దుమణగలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, మాక్రాన్ తన పర్యటనను ఆపకుండా సిరియా పౌర సమాజ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవంతో కూడిన ఒక కొత్త అధ్యాయం మొదలైందని సిరియా ప్రభుత్వం పేర్కొంది. ఈ పర్యటన ముగించుకుని మాక్రాన్ టర్కీలోని అంకారాలో జరగబోయే నాటో సదస్సుకు బయలుదేరనున్నారు. అక్కడ సిరియా అధ్యక్షుడు షరా కూడా హాజరై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.









