
Shabana Mahmood :బ్రిటన్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిన ఇరాన్, రష్యాలకు చెందిన మూడు కీలక సంస్థలపై నిషేధం విధించేందుకు యూకే ప్రభుత్వం సిద్ధమైంది. ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన సైనిక దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC), ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ కంపానియన్ ఆఫ్ రైట్స్ (ICMR) తో పాటు రష్యా మిలిటరీ నిఘా విభాగం జీఆర్యూ (GRU) తమ దేశ భద్రతకు తీవ్ర ప్రాణసంకటంగా మారాయని హోం శాఖ సెక్రటరీ షబానా మహమూద్ స్పష్టం చేశారు. జాతీయ భద్రతా చట్టం ప్రకారం ఈ సంస్థలను నిషేధిస్తున్నట్లు హోం శాఖ అధికారికంగా ప్రకటించగా, త్వరలోనే దీనికి సంబంధించిన తుది అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
బ్రిటన్ భూభాగంపై ఈ సంస్థలు సాగిస్తున్న అక్రమ చర్యలు, డిజిటల్ నెట్వర్క్లపై జరుగుతున్న సైబర్ దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా మారడమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం. ముఖ్యంగా, యూకేలో నివాసముంటున్న ఇద్దరు ఇరాన్ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే యూదు సమాజాన్ని టార్గెట్ చేస్తూ సాగించిన పలు దాడుల వెనుక ఐసిఎమ్ఆర్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభ్యమవ్వడం బ్రిటన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచింది.
దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే అత్యంత ప్రాధాన్య అంశమని యూకే హోం శాఖ పునరుద్ఘాటించింది. సేకరించిన ఆధారాలు, నిఘా వర్గాల సమగ్ర నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో విదేశీ శక్తుల నుంచి బ్రిటన్ పౌరులకు, దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి విఘాతం కలగకుండా నిరోధించేందుకే ఈ విధమైన సైనిక, నిఘా సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.









