
Ashada Masam : తెలుగు వారి సంప్రదాయంలో ఆషాఢ మాసం అంటేనే చాలామందిలో ఒక రకమైన సందేహం ఉంటుంది. ఆషాఢంలో శుభకార్యాలు చేయకూడదా? ఇది అశుభమా? అన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. అసలు ఆషాఢ మాసం అంటే ఏమిటి? ఎందుకు ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టరు? అన్న విషయాలను తెలుసుకుందాం.
నిజానికి, ఏ మాసం కూడా అశుభం కాదు. ప్రతి మాసానికి దానికంటూ ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢ మాసాన్ని అశుభమని అనడం కంటే, దానికి కొన్ని ఆరోగ్య , ప్రకృతి సంబంధిత కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తారు. ఆషాఢ మాసం వర్షాకాలం ఆరంభంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి.
Also Read : అయోధ్య రామమందిరానికి CEO పోస్టు : నోటిఫికేషన్ జారీ.. క్వాలిఫికేషన్స్ ఇవే!
ఆషాఢంలో కొత్తగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి పెద్ద శుభకార్యాలు చేయకపోవడానికి ప్రధాన కారణం మన ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులే. వర్షాకాలం ప్రారంభం కావడంతో గాలిలో తేమ పెరిగి, కలుషిత నీరు, దోమలు, సూక్ష్మక్రిముల వల్ల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఇలాంటి అనారోగ్య సమయాల్లో బంధువులను పిలిపించి వేడుకలు జరపడం ఇబ్బందిగా ఉండేది. రైతన్నలకు ఆషాఢం అంటేనే పొలం పనుల్లో బిజీగా ఉండే సమయం. సాగు పనులతో అందరూ నిమగ్నమై ఉంటారు కాబట్టి, ఆ సమయంలో శుభకార్యాలు పెట్టుకుంటే ఎవరికీ తీరిక ఉండదు. అందుకే ఆషాఢాన్ని సాగుకు కేటాయించారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు, ఉపవాసాలకు, పూజలకు శ్రేష్టమైనదిగా భావిస్తారు. అంటే, బయట పనుల కంటే మనశ్శాంతిని ఇచ్చే భక్తి మార్గంలో ఉండమని ఈ మాసం సూచిస్తుంది. ఆషాఢంలో కొత్తగా పెళ్లైన దంపతులు దూరంగా ఉండాలని ఒక ఆచారం ఉంది. దీని వెనుక కూడా ఆరోగ్య కోణమే ఉంది. కొత్తగా పెళ్లైన దంపతులకు ఈ సమయంలో గర్భధారణ జరిగితే, వర్షాకాలపు రోగాల వల్ల తల్లికి, బిడ్డకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. చైత్ర మాసంలో పుట్టే బిడ్డలు, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి, ఆషాఢం అంటే అశుభం కాదు, అది ప్రకృతిని అర్థం చేసుకునే మాసం. బయట పనుల కన్నా మన ఆరోగ్యంపై, ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టాలని మన పెద్దలు పెట్టిన ఒక మంచి నియమం ఇది. కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలు చేయకపోవడం అనేది మతపరమైన భయం కాదు, అది మన శ్రేయస్సు కోరిన ఒక సంప్రదాయం మాత్రమే.
Also Read : బిగ్ షాక్ : ఆ పథకం నుంచి 92 లక్షల మంది మహిళలు ఔట్!









