Big Breaking :నీట్ (NEET) పోటీ పరీక్షలో పేపర్ లీక్, తీవ్రమైన అక్రమాలు, పరీక్షల నిర్వహణలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)నేతృత్వంలో చేపట్టిన సుదీర్ఘ ఆందోళనలు ఫలించడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన వేళ, నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, దేశ యువత ఆకాంక్షలను, వారి ప్రయోజనాలను గౌరవిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ విషయాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. “గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను ఎంతో బాధించాయి. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి, వారి భవిష్యత్తు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అని స్పష్టం చేశారు.

దీనిపై ప్రధాన్ స్పందిస్తూ, అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామని, తిరిగి విజయవంతంగా పరీక్ష నిర్వహించామని చెప్పారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నానని, యువత తమ సమయాన్ని చదువులకే కేటాయించాలని కోరారు. ఇన్నాళ్లూ మంత్రిగా అవకాశమిచ్చిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చాయి. లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లోపభూయిష్టమైన పరీక్షల వ్యవస్థకు స్వస్తి చెప్పాలని, అలాగే బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని వారు బలంగా డిమాండ్ చేశారు. CJE నేతృత్వంలో జరిగిన ఈ చారిత్రాత్మక పోరాటం ఎట్టకేలకు కేంద్ర దిగివచ్చేలా చేసింది.

ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పరీక్షల వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు పునరావృతం కాకుండా “పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026” ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో జరిగే మాల్ ప్రాక్టీస్‌లపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తూ, కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు,నిర్దిష్ట కాలపరిమితిని ఇందులో ప్రతిపాదించారు. విద్యార్థుల పోరాటం మంత్రి రాజీనామాకే కాకుండా, పారదర్శకమైన నూతన చట్టానికి దారితీయడం విశేషం.

అసలేం జరిగిందంటే?

మే 5న నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా ప్రధానంగా బీహార్‌లోని పాట్నా,జార్ఖండ్‌లోని హజారీబాగ్ ప్రాంతాలలో ప్రశ్నాపత్రం లీకైనట్లు విచారణలో తేలింది.హజారీబాగ్ లోని ఒక పాఠశాలలో (Oasis School) మే 5న పరీక్ష ప్రారంభానికి ముందే ట్రంక్ పెట్టెల సీళ్లను మార్ఫింగ్/పరికరాలతో తెరిచి పేపర్‌ను యాక్సెస్ చేశారు. అక్కడి నుంచి సేకరించిన పేపర్‌ను పాట్నాలోని ఒక సేఫ్ హౌస్‌కు చేర్చి, విద్యార్థులకు ముందుగానే జవాబులు గుర్తుంచుకోవడానికి అందించారు.

దీనితో పాటు మహారాష్ట్ర (లాతూర్, నాసిక్), గుజరాత్ (గోద్రా),రాజస్థాన్ లలోని కొన్ని కేంద్రాల వద్ద కూడా ఈ లీకేజీ, సాల్వర్ గ్యాంగ్ నెట్‌వర్క్ కార్యకలాపాలు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కుట్ర వెనుక ప్రణాళికాబద్ధంగా పనిచేసిన అంతర్రాష్ట్ర ముఠా (Solver Gangs), కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, కొందరు విద్యాసంస్థల ప్రతినిధులు ఉన్నారు. సంజీవ్ ముఖియా (సొంతంగా ముఠాను నడిపిన నిందితుడు), సంజీవ్ సహాయకుడు రాకేష్ రంజన్ (రాకీ), పంకజ్ కుమార్. విద్యాసంస్థల నిర్వాహకులు: హజారీబాగ్ సెంటర్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ (సీళ్లను అనుమతించినందుకు), లాతూర్‌లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు (శివరాజ్ మోటేగాంకర్ వంటి ప్రొఫెసర్లు). సాల్వర్ గ్యాంగ్ (పేపర్ సాల్వర్లు): ఎయిమ్స్ (AIIMS) డియోఘర్, పాట్నా, భరత్‌పూర్ మెడికల్ కాలేజీలకు చెందిన కొందరు ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థులు లీకైన ప్రశ్నాపత్రానికి జవాబులు సిద్ధం చేసి పెట్టడానికి ఈ ముఠాకు సహకరించారు.

ఇప్పటివరకు సిబిఐ, వివిధ రాష్ట్రాల పోలీసులు కలిపి 40 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ముఠా సూత్రధారులు, పేపర్ కొనుగోలు చేసిన కొందరు విద్యార్థులు/తల్లిదండ్రులు, మెడికల్ కాలేజ్ సాల్వర్లు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఉన్నారు. సీబీఐ పలువురిపై ఇప్పటికే ప్రత్యేక కోర్టులలో చార్జ్‌షీట్లను కూడా దాఖలు చేసింది.

విద్యార్థుల ఆత్మహత్యలు

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆందోళనలను నింపింది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడం, తిరిగి రీ-టెస్ట్ నిర్వహించే క్రమంలో తలెత్తిన తీవ్ర మానసిక ఒత్తిడి, అనిశ్చితి కారణంతో సుమారు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ఈ విషాదకర ఘటనలు వెలుగులోకి రావడంతో విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహానికి గురైంది.

ఈ నేపథ్యంలో విద్యార్థుల హక్కుల కోసం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) 2026 జూన్ 6వ తేదీన ప్రత్యక్ష ఉద్యమంలోకి అడుగుపెట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన CJP, జూలై 20న చేపట్టిన ‘సంసద్ చలో’ (పార్లమెంట్ ముట్టడి) మార్చ్‌తో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని, పేపర్ లీక్ నిరోధక చట్టం తీసుకురావాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని CJP ప్రధానంగా డిమాండ్ చేసింది.

విద్యార్థులు , CJP బృందం చేపట్టిన సుదీర్ఘ నిరసనలు, ప్రజా ఒత్తిడి ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం “పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026” ముసాయిదాను ప్రవేశపెట్టింది. పరీక్షల లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విచారణ వంటి కీలక ప్రతిపాదనలతో భవిష్యత్తులో విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.