
Education Minister : నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో తలెత్తిన అవకతవకలు, వివాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరియు విద్యార్థి సంఘాలు గత 23 రోజులుగా చేపట్టిన సుదీర్ఘ పోరాటం, ఆందోళనల ఒత్తిడి ఫలితంగానే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యాశాఖ మంత్రి నిష్క్రమణతో విద్యార్థులు, యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రక్షాళన దిశగా ఇది ఒక ప్రధాన మలుపుగా మారింది.
మంత్రి రాజీనామా అనంతరం ఇప్పుడు అందరి దృష్టి విద్యాశాఖ తదుపరి బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారనే అంశంపైనే నెలకొంది. కొత్త మంత్రి పేరును కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, పాలనాపరమైన ఆటంకాలు లేకుండా ఒక సీనియర్ కేబినెట్ మంత్రికి దీనిని అదనపు బాధ్యత (Additional Charge) కింద అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమర్థవంతమైన పాలనా అనుభవం కలిగిన మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా లేదా భూపేందర్ యాదవ్ వంటి నాయకులలో ఒకరికి ఈ శాఖ తాత్కాలిక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం, విద్యాశాఖలో కీలక సంస్కరణలు చేపట్టాల్సి ఉండటంతో నితిన్ గడ్కరీ లేదా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తారా లేక స్వయంగా ప్రధానమంత్రే ఈ శాఖను తన వద్దే ఉంచుకుంటారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇవేవీ కాకుండా, ప్రస్తుతం విద్యాశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయంత్ చౌధరి లేదా డాక్టర్ సుకాంత మజుందార్లలో ఒకరికి స్వతంత్ర హోదా (Independent Charge) ఇచ్చే ప్రత్యామ్నాయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది.
ప్రభుత్వం త్వరలోనే పూర్తిస్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతుందా లేదా ఆదివారం నాటికి తాత్కాలిక నియామక ఉత్తర్వులు విడుదల చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. లీకేజీల వివాదంతో దెబ్బతిన్న విద్యావ్యవస్థపై విద్యార్థుల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపగల సమర్థుడైన నేతకే పగ్గాలు దక్కుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండేలను కేంద్రం వెంటనే ఢిల్లీకి రావాలని పిలుపు నివ్వడంతో వారిలో ఒకరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఫడ్నవీస్ కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మరో వైపు షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఏది ఏమైనా రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు నూతన విద్యామంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.









