
LRS : తెలంగాణలో అక్రమ లేఅవుట్లు, అనధికారిక ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల చెల్లింపు గడువును నవంబర్ 30 వరకు మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాటు ఫీజుల్లో ఇస్తోన్న 25 శాతం రాయితీని కూడా ప్రభుత్వం కొనసాగించనుంది.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఈ పథకాన్ని ప్రకటించగా, అప్పట్లో దాదాపు 25.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దరఖాస్తుదారులకు ఊరటనిచ్చేలా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ గడువు ఇస్తూ వస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూ వస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఆ ప్రత్యేక విధుల్లో నిమగ్నమయ్యారు. దీనివల్ల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగిందని, ఈ నేపథ్యంలో గడువును మరోమారు పొడిగించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తాము చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం మినహాయించుకుని మిగతా మొత్తం చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పొడిగింపు ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు వేగంగా పరిష్కారమవుతాయని యజమానులు భావిస్తున్నారు.









