
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల తర్వాత న్యూయార్క్‌లో ఇరాన్, అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఐరాస సమావేశాల కోసం న్యూయార్క్ వచ్చిన తమ దౌత్యవేత్తలను అమెరికా ప్రభుత్వం బలవంతంగా దేశం నుండి బయటకు గెంటేసిందంటూ వస్తున్న వార్తలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రచారం చేస్తున్న ఈ వార్తలన్నీ పూర్తిగా అబద్ధాలని తమ బృందం సభ్యులు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అమెరికా నుంచి తిరిగి వచ్చారని స్పష్టం చేశారు.
అసలు వివాదం ఏంటంటే?
ఐరాస సమావేశాలు పూర్తయిన వెంటనే ఇరాన్ ప్రతినిధులంతా అమెరికా విడిచి వెళ్లాలని అక్కడి విదేశాంగ శాఖ ముందే ఆదేశాలు జారీ చేసింది. అయితే సమావేశాలు ముగిసినా ఇరాన్‌కు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు ఇంకా న్యూయార్క్‌లోనే ఉండిపోయారని అమెరికా గుర్తించింది. దీంతో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్రంగా పరిగణించి వారిని వెంటనే దేశం దాటాలని హెచ్చరిస్తూ ఆ ఇద్దరినీ బహిష్కరించినట్లు సమాచారం. అయితే అమెరికా హెచ్చరికల తర్వాత ఒక దౌత్యవేత్త శుక్రవారం రాత్రి, మరొకరు శనివారం ఉదయం న్యూయార్క్ విడిచి వెళ్లారని ఒక అమెరికా అధికారి ఓ నివేదికలో వెల్లడించారు.
అయితే ఈ వార్తలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సోషల్ మీడియా వేదిక ‘X’ లో స్పందించారు. అమెరికా అధికారులు ప్రచారం చేసుకుంటున్న బహిష్కరణ వార్తలను ఆయన నకిలీవని కొట్టిపారేశారు. ఐరాస సమావేశాలకు వచ్చిన ఇరాన్ దౌత్యవేత్తలందరూ తమ ముందస్తు ప్రణాళిక ప్రకారమే దేశం విడిచి వెళ్లారని.. ఎవరినీ ఎవరూ వెళ్లగొట్టలేదని స్పష్టం చేశారు. ముందుగానే బయలుదేరిన ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారందరూ సరైన సమయానికే నిష్క్రమించారని తెలిపారు.
ఈ సందర్భంగా అమెరికా వైఖరిపై అరాఘ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బూటకపు దౌత్యవేత్తల బహిష్కరణ డ్రామాలు ఆడటం, దాన్ని గొప్పగా జరుపుకోవడం అమెరికా నిస్సహాయతను, మానసిక ఓటమిని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు. ఐక్యరాజ్యసమితికి ఆతిథ్యం ఇస్తున్న ఒక దేశంగా పాటించాల్సిన కనీస బాధ్యతలకు విరుద్ధంగా అమెరికా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సమావేశాల సందర్భంగా ఇరు దేశాల అధికారుల మధ్య కొన్ని కీలక చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఇరాన్‌తో చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవైపు చర్చల ప్రతిపాదనలు వస్తూనే.. మరోవైపు దౌత్యవేత్తల నిష్క్రమణపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది.









