
Bhogapuram Airport : ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చివేసే చారిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది. భోగాపురంలో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ టెర్మినల్ భవనాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. రూ.4,727 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు,జీఎమ్మార్ (GMR) గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ టెర్మినల్ భవనంలోని ఆధునిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, ఎయిర్‌పోర్ట్ డిజైన్, సాంకేతిక అంశాలను జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలతో పాటు టెర్మినల్‌లోని అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని వీక్షించారు. ఈ వీడియో వాల్ ద్వారా ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ,ఉత్తరాంధ్ర చారిత్రక ఘట్టాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను సీఎం చంద్రబాబు ప్రధానికి స్వయంగా వివరించి చెప్పారు.
Also Read : నేడే భోగాపురం ‘అల్లూరి’ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం… దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
13,500 మంది గిరిజన మహిళల ‘థింసా’ నృత్య నీరాజనం
ఈ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా గిరిజన సాంప్రదాయ ‘థింసా’ నృత్యం నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన దాదాపు 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా గులాబీ, ఆకుపచ్చ అంచు చీరలు ధరించి లయబద్ధంగా నృత్యం చేస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. టెర్మినల్ భవనం నుంచి బహిరంగ సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జరిగిన ఈ సంస్కృతిక ప్రదర్శనను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ ఆసక్తిగా తిలకించారు.
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అత్యంత వైభవంగా స్వాగతం పలికారు. బహిరంగ సభా వేదికపై ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పొందురు ఖాదీ’ శాలువాతో సత్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ప్రతీక అయిన ‘బొబ్బిలి వీణ’ను ప్రధానికి కానుకగా బహూకరించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించిన అనంతరం గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి ప్రధాని ఫొటోలు దిగారు.
సభ ప్రారంభానికి ముందు వేదికపై ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని రాకకంటే ముందే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు,కేంద్ర మంత్రులు వేదికపైకి వచ్చి ఆసీనులయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు పక్కన అశోక్ గజపతిరాజు, ఆయన పక్కన పవన్ కల్యాణ్ కూర్చుని ఉండగా.. అది గమనించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. ఈ దృశ్యంతో సభా ప్రాంగణమంతా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నామస్మరణలతో మారుమోగిపోయింది.
రూ.4,727 కోట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక, పర్యాటక రంగాల పురోగతికి మైలురాయిగా నిలవనుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, ఏవియేషన్ హబ్, ఉపాధి అవకాశాల కల్పనతో ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతం కానుంది. స్థానిక గిరిజన సంస్కృతికి అద్దం పడుతూ, అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో నిర్మాణం జరుపుకున్న ఈ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయడం ద్వారా ప్రాంతీయ అనుసంధానత (రిజినల్ కనెక్టివిటీ) మరింత బలోపేతం కానుంది.
Also Read : NTAలో భారీ ప్రక్షాళన.. 47 మంది అధికారుల ఉద్యోగాలు ఊస్ట్









