hardik pandya donate hair at tirupati
hardik pandya donate hair at tirupati

తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ, భక్తిపారవశ్యంతో కూడిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనంతో ప్రశాంతత, ఆనందాన్ని పొందుతారు. సామాన్య భక్తులతో పాటు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు సైతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హార్థిక్ ఆలయంలోనే గుండు చేయించుకుని మొక్కు తీర్చుకున్నారు. ఇటీవలే ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కూడా తిరుమలకు వచ్చి గుండు చేయించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకుంటున్నారు. ఎంతటి పెద్ద హోదాలో ఉన్నప్పటికీ స్వామివారి ముందు అందరూ సమానులేనన్న భావనతో వినయాన్ని కనబరుస్తున్నారు.

దేవుని వద్ద తలనీలాలు సమర్పించడం అనేది సామాన్య భక్తులకు మాత్రమే కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలకు ఆధ్యాత్మిక నమ్మకంగా మారింది. అయితే దీనివెనుక ఉన్న సంప్రదాయం ఏంటి?.. తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు?.. అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

భక్తులు ఎందుకు గుండు చేయించుకుంటారు?

తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామివారి వద్ద భక్తులు తలనీలాలు సమర్పించడం అనేది ఇప్పటి ఆచారం కాదు. అది శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, తమ కేశాలను దేవునికి దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలు తొలగి.. సంతోషం, మనశ్శాంతి సిద్ధిస్తుందని వారి నమ్మకం. అయితే హిందూ ధర్మంలో తలనీలాలు సమర్పించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

సాధారణంగా జుట్టు అనేది మనుషులలోని అహంకారానికి, అందానికి, గర్వానికి సంకేతంగా నిలుస్తుంది. అలాంటి జుట్టును దేవుని వద్ద త్యాగం చేయడం ద్వారా ‘‘నాలోని అహంకారాన్ని నీ పాదాల వద్ద వదిలేస్తున్నాను’’ అనే భావాన్ని వ్యక్తపరుస్తారని చెప్పుకుంటారు. ఇది వారి భక్తి, కృతజ్ఞత, వినయానికి నిదర్శనంగా భావిస్తారు. కొందరు తమ కోరికలు నెరవేరిన తర్వాత జుట్టు దానం చేయడానికి.. అలాగే మరికొందరు ఒక నిర్దిష్ట సంకల్పం నెరవేరాలని స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు.

జుట్టు దానం వెనుక పౌరాణిక కథ

కాగా తిరుపతిలో జరిగే కేశదాన కార్యక్రమం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పుణారాల ప్రకారం.. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతిని అమ్మవారిని వివాహం చేసుకునే సమయంలో.. అప్పటి సాంప్రదాయం ప్రకారం.. పెళ్లికి ముందు వధువు కుటుంబానికి పెద్ద మొత్తంలో ప్రత్యేక కానుక ఇవ్వవలసి వచ్చింది. ఆ కానుకను చెల్లించడానికి ధనం లేకపోవడంతో.. వెంకటేశ్వర స్వామి ధనవంతుడైన కుబేరుని నుండి అప్పుతీసుకుని పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఆ అప్పు మొత్తాన్ని కలియుగం ముగిసేలోపు వడ్డీతో సహా తీరుస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి ఆశీస్సులతో.. స్వామివారి అప్పు తీర్చడంలో సహాయపడే భక్తులకు ప్రతిఫలం లభిస్తుందని ఒక నమ్మకం. ఇలా భక్తులు సమర్పించిన జుట్టును అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని శ్రీవారి రుణం తీర్చడానికి ఉపయోగిస్తారని చాలా మంది నమ్ముతారు. ఈ కారణం వల్లనే స్వామివారికి అప్పు తీర్చడంలో భాగస్వాములు కావడానికి భక్తులు తమ జుట్టును భక్తిశ్రద్ధలతో దానం చేస్తారు.