CM Chandrababu :  రాజమండ్రిలో దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురై ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న సీఎం, ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, చట్టప్రకారం వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ కేసులో నిందితులు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారని, వారికి తగిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

కాగా, ఈనెల 3న రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించిన నిందితులు మొదట సినిమా హాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అనుమతి లేదని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఆపై నిందితులను పట్టుకునేందుకు సెక్యూరిటీ యత్నించగా, వారు కారులో పారిపోతూ తీవ్ర నిర్లక్ష్యంతో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా, వరుసగా మూడుసార్లు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి.

అనంతరం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించగా ఈ రోజు మధ్యాహ్నం 3:20 గంటలకు ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. ఆరు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయిన ప్రియాంక మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. తమ బిడ్డ ప్రాణాలను బలిగొన్న నిందితులను నడిరోడ్డుపై చంపేయాలని ప్రియాంక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక, ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.