Delhi High Court :  అమ్మాయిల బట్టల ఎంపిక అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. జీన్స్ ధరించడం వల్ల యువకుల మనస్తత్వం చెడిపోతుంది అనడం తీవ్ర ఆందోళనకరమైన, ఆమోదయోగ్యం కాని మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. 2013లో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ట్రయిల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించగా, హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి అతడిని దోషిగా తేలుస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే బాలిక మైనర్ అని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో.. ఈ కేసుకు పోక్సో చట్టం వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read : బిగ్ షాక్ .. నటుడు ప్రకాశ్‌రాజ్ ఓటు గల్లంతు!

నిందితుడు తన పొరుగువాడని, తనను వేధించాడని, లైంగిక వేధింపుల వ్యాఖ్యలు చేశాడని, అసభ్యంగా తాకాడని బాధితురాలైన బాలిక ఆరోపించింది. 2014లో ట్రయిల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

విచారణ సమయంలో డిఫెన్స్ లాయర్లు అనుసరించిన క్రాస్-ఎగ్జామినేషన్, వాదనల ద్వారా బాలికను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాలిక ధరించే వెస్ట్రన్ దుస్తులు, ఆ ప్రాంతంలోని ప్రజల మతం, ఆమె దుస్తులపై వారి అభ్యంతరాల గురించి ఆమెను ప్రశ్నలు అడిగారని కోర్టు పేర్కొంది. జస్టిస్ చంద్రశేఖరన్ సుధ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక అమ్మాయి లేదా మహిళ ఏం ధరించాలనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం.. ఆమె దుస్తులను శాసించే హక్కు పొరుగువారికి గానీ, సమాజానికి గానీ, నిందితుడికి గానీ, కోర్టులో వాదిస్తున్న న్యాయవాదికి గానీ లేదన్నారు. అది ఎవరికీ సంబంధం లేని విషయం. జీన్స్ ధరించిన మహిళ యువకుల మనస్తత్వాన్ని పాడుచేస్తుంది అనే సూచన తీవ్రంగా కలవరపెట్టే, ఆమోదయోగ్యం కాని ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

కోర్టు మరింత స్పందిస్తూ, అమ్మాయిలు, మహిళల దుస్తులను నియంత్రించడం ద్వారా సమస్య పరిష్కారం కాదంది. దీనికి బదులుగా తల్లిదండ్రులు, సమాజం తమ పిల్లలకు ప్రవర్తనను నియంత్రించడం, వ్యక్తిగత సరిహద్దులను గౌరవించడం, ఇంట్లో లేదా బయట ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం నేర్పించాలి అని తెలిపింది.

Also Read : You Tube కొత్త రూల్స్ : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్.. పెరిగిన వాచ్ అవర్స్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.