
Khammam : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోనాల పండగ సెలవులకు ఇంటికి వచ్చిన చిన్నారి.. జలుబు, దగ్గుతో బాధపడుతుండగా RMP వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై సూరజ్ బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపురానికి చెందిన చల్లా రమేశ్, మౌనికల కూతురు హేమశ్రీ (14) స్థానిక కస్తూర్బా విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బోనాల పండగ సందర్భంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన ఆ పాప, కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపింది.
అయితే ఆదివారం రోజు హేమశ్రీకి స్వల్పంగా జలుబు, దగ్గు చేశాయి. పాఠశాలకు వెళ్లే ముందు ఆరోగ్యం కుదుటపడాలని భావించిన తల్లిదండ్రులు, స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎమ్‌పీ డాక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లారు. ఆ వైద్యుడు పాపకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి, మరో ఇంజెక్షన్ ఇస్తుండగానే హేమశ్రీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి నోటి నుంచి నురగ కక్కింది. కళ్ల ముందే కూతురు ఊపిరాడక ఇబ్బంది పడటం చూసి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Also Read : విజయవాడలో రూ.100 కోట్ల భారీ స్కామ్… ఇంట్లో కూర్చొని లక్షల సంపాదన అని…
అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. పాప అప్పటికే మృతి చెందిందని తెలిపారు. కేవలం సాధారణ జలుబు, దగ్గుకే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆర్ఎమ్‌పీ ఏం వైద్యం చేశారంటూ సిబ్బందిని నిలదీశారు.
సమాచారం అందుకున్న ఎస్సై సూరజ్ సంఘటన స్థలానికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎమ్‌పీ ఇచ్చిన గుర్తుతెలియని ఇంజెక్షన్ వల్లే తన కూతురు చనిపోయిందని తండ్రి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఖమ్మం ఆసుపత్రికి వచ్చిన ఆ గ్రామీణ వైద్యుడు.. పాప చనిపోయిన విషయం తెలుసుకుని పరారయ్యాడని ఎస్సై వెల్లడించారు.
Also Read : ఆఫీసులో ఫుల్ టార్చర్.. 4 నెలలుగా నో వీక్ ఆఫ్.. పురుగుల మందు తాగి!









