Nizamabad :  అధిక అప్పులు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఆ దంపతులు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. భర్త ఉరివేసుకుని చనిపోగా.. భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా మండలం నాగంపేట్‌కు చెందిన శేశాల నరేష్ (35), నిజామాబాద్ కోటగల్లీకి చెందిన మేఘన (30) దంపతులు. నరేష్ కరెంట్ ఆఫీసులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, వినాయక్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

గతేడాది నరేష్ రూ.90 లక్షలు అప్పు చేసి ఒక ఇల్లు కొన్నారు. ఆ అప్పును బ్యాంకు లోన్‌తో తీర్చాలని భావించినప్పటికీ, బ్యాంకుల్లో రుణం రాలేదు. దీంతో అప్పుల ఒత్తిడి ఎక్కువై, ఆ ఇల్లును అమ్మేయాల్సి వచ్చింది. వచ్చిన డబ్బుతో కొంత రుణం తీర్చినా, ఇంకా భారీగా అప్పులు మిగిలిపోయాయి.

Also Read : జలుబు అని RMP డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ప్రాణమే పోయింది!

ఈ పరిణామాలతో నరేష్ డిప్రెషన్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతనికి చికిత్స కూడా చేయిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఒత్తిడి నుంచి కోలుకోలేకపోయిన నరేష్.. బెడ్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరో గదిలో భార్య మేఘన కూడా విషం తాగి విగతజీవిగా మారింది.

మంగళవారం ఉదయం 10:30 గంటలకు మేఘన తన తల్లికి ఫోన్ చేసింది. ఆమె సరిగా మాట్లాడకపోగా, పిల్లలను వేరొకరి ఇంటికి పంపానని చెప్పడంతో తల్లికి అనుమానం వచ్చింది. గంటన్నర తర్వాత భర్త మోహన్, బంధువులతో కలిసి కూతురి ఇంటికి వెళ్లింది. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీలోంచి లోపలికి వెళ్లి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది. వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దంపతులు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

ఘటనా స్థలంలో దంపతులు రాసిన చివరి లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అప్పులు, అనారోగ్యమే తన ఆత్మహత్యకు కారణం.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి” అని నరేష్ ఆ లేఖలో రాశారు. దాని కిందే మేఘన.. మా మీద కోపాన్ని పిల్లలపై చూపొద్దు. వారు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని రాసి ఉంది. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మేఘన, మనస్తాపంతో ముందే విషం తాగి ఉంటుందని బంధువులు రోదిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి తనువు చాలించడంతో ఆ పసివాళ్లు అనాథలుగా మారారు.

Also Read : విజయవాడలో రూ.100 కోట్ల భారీ స్కామ్…ఇంట్లో కూర్చొని లక్షల సంపాదన అని…

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.