ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. కొందరికి దీనివల్ల మంచి జరిగితే మరికొందరికి చెడు జరుగుతోంది. అయితే ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో ఏఐ ఓ ప్రాణాన్ని కాపాడిన ఘటన చోటుచేసుకుంది. తన మాజీ ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేయడానికి ప్రణాళికలు రచించిన ఓ వ్యక్తిని చాట్‌జీపీటీ సమయస్ఫూర్తితో ఎఫ్‌బీఐ అధికారులకు పట్టిచ్చింది. అసలు ఏం జరిగిందంటే?

ఫ్లోరిడాకు చెందిన డారెన్ జౌ (25) అనే యువకుడు తన మాజీ ప్రియురాలితో రిలేషన్ క్లోజ్ అయిన తర్వాత కోపం, అసూయతో రగిలిపోయాడు. మళ్లీ మళ్లీ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో ఆమెపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మార్చి నెల నుండి చాట్‌జీపీటీతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట్లో తన ఎమోషనల్ స్టోరీ, బాధ గురించి మాట్లాడేవాడు. ఆ తర్వాత తన మాజీ ప్రియురాలిపై లైంగిక దాడి చేసి, హత్య చేసేందుకు ఎలాంటి ప్లాన్ వేయాలో చాట్‌బాట్‌తో చర్చించడం మొదలుపెట్టాడు.

Also Read : పాక్, టర్కీలతో ఒప్పందం ఉన్నా వేస్ట్‌.. సౌదీ నౌకలపై హూతీల దాడులు.. అసలేం జరిగింది?

ఈ నెలాఖరులోగా ఆమెను చంపేస్తాను. ఆమె నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు అని అతను విపరీతమైన కోపంతో మెసేజ్‌లు చేశాడు. తన వద్ద ఉన్న తుపాకులు, గ్లాక్ హ్యాండ్‌గన్, జిప్ టైలు, గ్లౌజుల ఫోటోల గురించి కూడా ప్రస్తావించాడు. రెండు నెలల పాటు ఈ చాటింగ్ కొనసాగింది. దీన్ని చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ భద్రతా వ్యవస్థలు గుర్తించాయి. హింస, అత్యాచారం, హత్య వంటి అత్యంత ప్రమాదకరమైన అంశాలపై అతడు ప్లాన్ చేస్తున్నాడని గ్రహించిన ఓపెన్‌ఏఐ యాజమాన్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐని అప్రమత్తం చేసింది.

ఎఫ్‌బీఐ అధికారులు వెంటనే రంగంలోకి దిగి జౌ చాట్ హిస్టరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో జౌ తనపై మోపబడిన తీవ్రమైన వేధింపులు, చంపేస్తానని బెదిరించడం వంటి అభియోగాలను అంగీకరించాడు. దీనితో సర్క్యూట్ కోర్టు జడ్జి అతనికి ఎనిమిదేళ్ల ప్రొబేషన్ శిక్షను ఖరారు చేశారు. ఇందులో భాగంగా అతను రెండేళ్లపాటు యాంకిల్ మానిటర్ ధరించాలని, మానసిక చికిత్స పొందుతూ ఎలాంటి తుపాకులు లేదా ఆల్కహాల్ వాడకూడదని షరతులు విధించారు.

గతంలో పలు నేర దర్యాప్తుల్లో నిందితులు గూగుల్ జెమిని లేదా ఇతర చాట్‌బాట్‌లను ఉపయోగించి హత్యలకు ప్లాన్ వేసిన ఆధారాలు బయటపడ్డాయి. అయితే ప్రతికూల విషయాలు చర్చించేటప్పుడు ఏఐ కంపెనీలు సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ కేసుతో ఓపెన్‌ఏఐ తీసుకున్న చొరవపై అందరూ ప్రశంసిస్తున్నారు.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. ప్రజల్లో భారీగా పడిపోయిన క్రేజ్.. ఇక పదవి పోయినట్లేనా?