Kenya :  కేన్యా ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు అమెరికా పౌరులు సహా మొత్తం ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

కేన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం హెలికాప్టర్ లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి సంబూరు కౌంటీలోని ఎవాసో నిరో ప్రాంతానికి వెళ్తుండగా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

మృతుల్లో ఎన్‌బిసి యూనివర్సల్‌కు చెందిన టెలెముండో టీవీ నెట్‌వర్క్ ఫ్లోరిడా విభాగం ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జోస్ సువారెజ్ (55) కూడా ఉన్నట్లు సమాచారం. తమ ఎగ్జిక్యూటివ్ మృతి పట్ల టెలెముండో ఎన్‌బిసి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అమెరికా రాయబార కార్యాలయం కేన్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ బాధితుల కుటుంబాలకు సహాయం అందిస్తోంది.

ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఓలోలోక్వే పర్వత ప్రాంతంలోని లోయల్లో ఈ ప్రమాదం జరిగింది. లేడీ లోరీ హెలికాప్టర్స్ అనే స్థానిక సంస్థకు చెందిన ఈ విమానంలో పర్యాటక కంపెనీ ప్రతినిధులు ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకోవడానికి కేన్యా రెడ్‌క్రాస్, స్థానిక సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేన్యాలో టూరిజంపై ఆధారపడి నడిచే హెలికాప్టర్ సర్వీసులు ఇటీవల వరుస ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.