
US-Iran War: అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటించడాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అమెరికాలో భారీగా అప్పులు, విపరీతంగా పెరుగుతున్న వడ్డీ ఖర్చుల వంటి స్వీయ సంక్షోభాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇరాన్ పై చర్యల లేవనెత్తినట్లు ఆ దేశం ఆరోపించింది. ఆ దేశం విఫలమైన విధానాలను కొనసాగించడం వల్ల మున్ముందు కూడా ఓటమిని, ఇరాన్ ప్రజల శత్రుత్వాన్ని మూటగట్టుకోవడం తప్ప ఏమీ సాధించలేరని ఇరాన్ తేల్చి చెప్పింది.
అమెరికా చేపడుతున్న ‘ఆర్థిక ఉగ్రవాదం’.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించనుందని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా (USA) అప్పులు 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయనే సూచించే మీడియా నివేదికలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరిస్తానని ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చినప్పటికీ.. ఆయన అనుసరించిన అనేక విధానాలు రుణ భారాన్ని మరింత పెంచాయని నివేదికలు వెల్లడించాయి.
ట్రంప్ ఏమన్నారంటే…
ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తున్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచ పటంలో టెహ్రాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరో కొత్త ఎత్తుగడను అనుసరించాలని చూస్తోంది. ఇరాన్‌కు సాయం చేసే దేశాలను ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మేరకు హెచ్చరించారు.
ఇప్పటి వరకు ఏ దేశంపైనా చేపట్టని అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను తను ఈ రోజు ఇరాన్ పై ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందం విషయంలో ఇరాన్‌కు నేనిచ్చినంత గొప్ప అవకాశం ఎవరూ ఇవ్వలేదని ట్రంప్ పేర్కొన్నారు. కానీ, డీల్ కుదుర్చుకోవడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే, ఈ రోజు తను ఆ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నానని ట్రంప్ హెచ్చరించాడు.
ఇరాన్‌ను ఒంటరిని చేయడమే మా లక్ష్యం అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ కు చెందిన నౌకాదళం పూర్తిగా నాశనమైంది, వాయుసేన ధ్వంసమైంది. సైనిక కర్మాగారాలు కూలిపోయాయి. వారి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు వారికి ఆర్థికంగానూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు జీవనాధారాన్ని అందిస్తే గనుక.. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు.. ఇవన్నీ ఇప్పుడే ఆగిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. అవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇరాన్ ముప్పును ఎదుర్కోడానికి, దాన్ని ఏకాకిని చేసి, ఓడించడానికి అమెరికా మిత్రదేశాలన్నీ మాతో కలిసి రావాలని ట్రంప్ కోరారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.









