Auto Bandh : ఆటో, ప్రైవేట్‌ రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం అర్థరాత్రి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఆటోలు, స్కూల్‌ వ్యాన్లు నిరవధికంగా బంద్‌ పాటించనున్నట్లు రాష్ట్ర ఆటో, యాప్‌ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ బంద్‌లో బీపీటీఎంఎం, బీఆర్‌టీయూ, బీఎంఎస్‌, సీఐటీయూ, టీయూసీఐ, టీఎన్‌టీయూసీ తదితర కార్మికసంఘాలు పాల్గొంటున్నాయని జేఏసీ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు మూలంగా ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లకు ఏటా ఇస్తామన్న రూ.12 వేల ఆర్థికసాయం, ఆటో, ప్రైవేట్‌ రవాణా కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు, రాష్ట్రవ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని వారు ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. అలాగే ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.

అయితే తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, సూల్‌ వ్యాన్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బంద్‌కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. అలాగే ఆర్టీఏ కార్యాలయాల్లో కార్పొరేట్‌ రేడియం దందాను అరికట్టాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం వారు ఆరోపించారు, అనవసరపు రేడియంతో ఆర్థికంగా మరింత భారం పడుతున్నదని వాపోతున్నారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గిగ్‌ వర్కర్స్‌ అగ్రిగేటర్‌ పాలసీని తెలంగాణలోనూ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్రాప్‌ మార్గదర్శకాలను మనదగ్గరా అమలు చేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఓలా, ఊబర్‌, ర్యాపిడో బైక్‌ సేవల పేరుతో జరుగుతున్న అక్రమవ్యాపారాన్ని అరికట్టాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : భర్త చనిపోతే బొట్టు.. గాజులు తీసేయాలా.. నటి అనసూయ సంచలన వ్యాఖ్యలు

రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన..

కాగా, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద భీమా ఉండేదని. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.5 లక్షల ప్రమాద భీమా ఎత్తేసిందని ఆటో కార్మిక జే ఏ సి చైర్మన్ ,బీ ఆర్ టీ యూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ రోజు అర్థరాత్రి నుంచి బంద్‌ పాటించనున్నామని తెలిపారు. రేపు వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్‌టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నామని మారయ్య తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరూ రేపటి బంద్ కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని మారయ్య అన్నారు. ప్రభుత్వమే ప్రత్యేక ఆన్ లైన్ యాప్ తెచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. రేపటి సమ్మెను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. దయచేసి ఆటో డ్రైవర్లు ఎవరు ఆ సంఘాల మాటలు నమ్మకండి. ఆటో డ్రైవర్లు రేపటి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మారయ్య పిలుపునిచ్చారు.

Also Read : రాయదుర్గం భూముల వేలానికి సుప్రీం క్లియరెన్స్‌.. ఎకరా రూ.264 కోట్లు ?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.