
Bangladesh : బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆ దేశంలో నివసిస్తున్న రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబం అనుమానాస్పద రీతిలో హత్యకు గురైంది. కాగా వారి ఇంటిపై డ్రగ్స్ తీసుకుంటున్న వారిని ప్రశ్నించినందుకు వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు నివాసంలో చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అయితే వీరిని ఎవరూ చంపారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
ఈ దారుణ సంఘటన రంగ్‌పుర్‌లో చోటుచేసుకుంది.పోలీస్ కమిషనర్ మహ్మద్ అబ్దుల్ తెలిపిన వివరాల ప్రకారం గణపతి చక్రవర్తి (65) కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ టీచర్‌గా రిటైర్డ్ అయి హోమియోపతి వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం రంగ్‌పుర్‌లో ఒక కొత్త ఇంటిని నిర్మించుకుని భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామీ (23), కుమారుడు ప్రియమ్ (12)తో కలిసి నివాసం ఉంటున్నారు. చక్రవర్తి భార్య ప్రీతిలతకు ఆమె సోదరి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అలాగే మిగతా కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం కలవకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శనివారం రాత్రి తాళం వేసి ఉన్న ఆ ఇంటి తలుపులను పగలగొట్టి చూడగా నలుగురు హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. చక్రవర్తి మృతదేహం ఇంటి పైకప్పుపైన, భార్య, కుమార్తె మృతదేహాలు మెట్లపైన, కుమారుడి మృతదేహం ఇంట్లోని మంచం కింద లభ్యమయ్యాయి.
కాగా, గురువారం రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీస్ కమిషనర్ మహ్మద్ అబ్దుల్ వెల్లడించారు. ఇద్దరు దుండగులు డ్రగ్స్ తీసుకోవడానికి చక్రవర్తి ఇంటిపైకి వెళ్లినట్లు తెలుస్తోంది. దాన్ని గమనించిన గణపతి వారిని ప్రశ్నించడంతో వారు తమను గుర్తుపట్టారని, గణపతి మెడకు టవల్తోచుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శబ్దం రావడంతో భార్య ప్రీతిలత ఇంటి పైకి వెళ్లగా దుండగులు ఆమెను సైతం గొంతునులిమి హత్య చేశారు. అనంతరం వారి పిల్లలను కూడా చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.









