
Hospital Fire Accident : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. NICUలో మంటలు చెలరేగడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్ల తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రి సిబ్బంది పలువురిని సురక్షితంగా తరలించారు.
Also Read : నాడు తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంది.. నేడు సూసైడ్..
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో NICUలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వెంటిలేటర్‌కు సంబంధించిన సాంకేతిక లోపం, అనుకోని పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే నిర్ధారణ కానుంది.
ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో దాదాపు 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడటంతో అప్రమత్తమైన వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది వెంటనే పసికందులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు విపరీతంగా ప్రయత్నించారు. సిబ్బంది ఎంతగా ప్రయత్నించినప్పటికీ, తీవ్ర గాయాలపాలై ముగ్గురు శిశువులు మృతి చెందడంతో ఆసుపత్రితో పాటు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మిగిలిన పసికందులలో మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. అప్పుడే పుట్టిన చిన్నారులు మంటల్లో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అగ్నిప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు, ప్రమాద వేళ చోటుచేసుకున్న పరిస్థితులపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read : భర్త చనిపోతే బొట్టు.. గాజులు తీసేయాలా.. నటి అనసూయ సంచలన వ్యాఖ్యలు









