
Central Government jobs :ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా పరిణమించింది. మనదేశంలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏళ్ల తరపడి చదివినా ఆ చదువుకు తగిన ఉద్యోగం రాక పలువురు ఉద్యోగాల కోసం తల్లడిల్లుతూనే ఉన్నారు. దీంతో చేసేది లేక పెద్దచదువులు చదివినా దానికి సరిపడా ఉద్యోగం దొరకక చిన్నా చితక పనితో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు కేంద్రం వెల్లడించింది.
నీమచ్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఉద్యోగాల ఖాళీలపై సమాచారం కోసం ఆర్టీఐ దాఖలు చేశారు. దానికి బదులిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పే రీసెర్చ్ యూనిట్ 2024 మార్చి 1 నాటి గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిలియన్ ఉద్యోగాల్లో ఏకంగా 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అవి తెలిపాయి. ఈ లెక్కల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు PSUలను మినహాయించుకొని చెప్పిన లెక్కలే ఇన్ని ఖాళీలను సూచిస్తున్నాయి.
ఈ మొత్తం ఖాళీలలో రక్షణ మంత్రిత్వ శాఖ సివిలియన్ విభాగంలోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మొత్తం 5,56,248 పోస్టులు మంజూరై ఉండగా కేవలం 3,14,005 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఇది మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 43.5 శాతం. అయితే ఈ సంఖ్యలు సైన్యం, నేవీ, వైమానిక దళంలోని ఉద్యోగాలకు సంబంధించినవి కావని, కేవలం రక్షణ శాఖ సివిలియన్ ఉద్యోగాలకే సంబంధించినవని అధికారులు తేల్చి చెప్పడం గమనార్హం.
రైల్వేలో
ఇక దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన రైల్వేల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. రైల్వేల్లో 14,79,701 పోస్టులు మంజూరై ఉండగా అందులో12,39,576 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో 2,40,125 పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లోని ఖాళీలే ఆర్టీఐ ద్వారా వెల్లడైన మొత్తం ఖాళీల్లో దాదాపు 30 శాతం కావడం గమనించాల్సిన విషయం.
హోం మంత్రిత్వ శాఖ
అంతర్గత భద్రత, పరిపాలనలో కీలకమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోనూ ఖాళీలున్నాయి. అందులో 1,10,885 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 11,18,233 పోస్టులు మంజూరవ్వగా 10,07,348 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రక్షణ శాఖ సివిలియన్ విభాగం, రైల్వేలు, హోం శాఖలను కలిపితే దాదాపు 5.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. అంటే మొత్తం ఖాళీల్లో దాదాపు మూడొంతులు ఈ మూడు ప్రధాన సంస్థల్లోనే ఖాళీగా ఉన్నాయి.
పర్యావరణ శాఖ
పర్యావరణ శాఖలోనూ పరిస్థితి అదే విధంగా ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో 5,127 పోస్టులకు గాను 3,170 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో 1,957 పోస్టులు, అంటే దాదాపు 38 శాతం పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 6,302 పోస్టులుండగా 3,684 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 2,618 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆరోగ్య రంగం
ఆరోగ్య రంగంలోనూ భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 27,427 పోస్టులకు గాను 25,845 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,582 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఆరోగ్య పరిశోధన శాఖలో 62 పోస్టులంటే వాటిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులోనూ 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ శాఖలో 432 పోస్టులుంటే199 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేలింది.
పోస్టల్
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్లోనూ 2,53,124 పోస్టులకు గాను 1,91,578 మంది పనిచేస్తున్నారు. అంటే 61,546 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 1,79,374 పోస్టులు మంజూరైతే 1,09,712 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.ఇందులో 69,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మంజూరైన పోస్టుల్లో దాదాపు 39 శాతంగా ఉండటం గమనించాల్సిన అంశం.
వ్యవసాయం
వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లోనూ సిబ్బంది కొరత ఉంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో 5,420 పోస్టులు ఉండగా 3,565 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,855 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో కూడా 2,393 పోస్టులకు గాను కేవలం 1,015 మంది పనిచేస్తున్నారు. ఇంకా 1,378 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ శాఖలో దాదాపు 58 శాతం పోస్టులు నింపాల్సి ఉంది.
దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కీలక శాఖల్లోనూ భారీగానే ఖాళీలు ఉన్నాయని ఆర్టీఐ తెలిపింది. అణుశక్తి శాఖలో 37,250 పోస్టులకు గాను 27,016 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇంకా 10,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. అంతరిక్ష శాఖలో 19,200 పోస్టులకు గాను 15,074 మంది పనిచేస్తుండగా, 4,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో కూడా 1,681 పోస్టులు ఖాళీగానే ఉన్నట్లు తేలింది.
దేశ అత్యున్నత పరిపాలనా కార్యాలయాల్లోనూ భారీగా ఖాళీలు ఉండటం కలవరపరిచే విషయం. రాష్ట్రపతి సచివాలయంలో 803 పోస్టులు మంజూరు కాగా, అందులో కేవలం 516 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 287 పోస్టులు, అంటే 35.74 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) 441 పోస్టులుంటే 315 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 126 పోస్టులు, అంటే 28.57 శాతం ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
కాగా దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంత పెద్ద ఎత్తున ఖాళీలు ఉండటంపై ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగుల మధ్య ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడేందుకు ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఇన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.









