Farmer OSD Sumanth’s Case : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం నగర పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముగ్గురిని కూడా పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్ ఉన్నట్లు తెలుస్తోంది. మార్టూరులో ఉన్న ఈ ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడైంది. అనంతరం తదుపరి విచారణ కోసం వారిని జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుమంత్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

Also Read : తెలుగు సినిమాలకు గోల్డెన్ టైమ్.. 62 రోజులు 6 హిట్లు.. దర్శకులే కింగ్!

ఇదిలా ఉండగా అంతకు ముందే సుమంత్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్‌లోని సుమంత్‌ ఇంటి ముందు నిన్న ఉదయం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ముగ్గురిని అరెస్ట్‌ చేయడంతో ఈ హైప్రొఫైల్ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరినట్లయింది. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నిందితుల ఆచూకీ కోసం పోలీసులు లోతుగా ఎంక్వయిరీ జరుపుతున్నారు. త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఓ రియల్‌ ఎస్టేట్ వ్యాపారిని రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పాటు ఇనుపరాడ్లతో అతనిపై దాడి చేశారని సుమంత్‌తో పాటు మరో ఆరుగురిపై మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుమంత్‌ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సుమంత్‌ కొల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌ ఓజోన్‌ హైట్స్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. సుమంత్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక బృందం అక్కడే ఎదురు చూసింది. తెల్లవారుజామున సుమంత్‌ డ్రైవరును అదుపులోకి తీసుకోగా ఈ రోజు మార్టూరులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుమంత్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

Also Read : ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు మృతి

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.