Director Kuchipudi Venkat : సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించడమనేది ఆశామాషీ విషయం కాదు. అందులోనూ శుక్రవారం వచ్చిందంటే.. వారి గుండెల్లో గుబులు మొదలవుతుందని డైరెక్టర్ కూచిపూడి వెంకట్ తెలిపారు. ఎందుకంటే ఈ ప్రపంచం శుక్రవారం రోజున థియేటర్ల ముందు కనిపించే వెలుగులు, రంగురంగుల పోస్టర్లు, జనం కొట్టే చప్పట్లు, కలెక్షన్ల లెక్కలు, టీవీ ఇంటర్వ్యూలు, వేడుకలు మాత్రమే చూస్తోంది. కానీ ఆ ఒక్క శుక్రవారం వెనుక దర్శకుడు పడిన కష్టం, అనుభవించిన వేదన ఎవరికీ కనిపించవన్నారు.

శుక్రవారం రాకముందు గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులు, గుండెల్లో దాచుకున్న భయం, గంటల తరబడి చేసిన నిరీక్షణ, ఎదుర్కొన్న తిరస్కారాలు, ఇన్వెస్ట్ చేసిన కోట్ల రూపాయలు, గడిచిపోయిన సంవత్సరాలు, కుటుంబ సభ్యుల మానసిక ఒత్తిడి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయన్నారు. వీటన్నింటికీ మించి డైరెక్టర్‌గా కలలు కంటున్న జీవితాన్ని శుక్రవారం నెరవేరుస్తుందో లేదో అని టెన్షన్. ఒక్కో శుక్రవారం డైరెక్టర్‌కు కలిసి వస్తే ఇంకో వారం మొత్తం జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

Also Read : బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ జాతర.. సోమవారం కూడా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్!

గడిచిన కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే ఎందరో రాత్రికి రాత్రే స్టార్స్ అవుతారని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు అసలు కనిపించరు. మళ్లీ సడెన్‌గా కొన్ని రోజులు తర్వాత సడెన్‌గా హిట్ కొడతారు. అలాంటి సమయంలో ఓ ఇంకా వీళ్లు సినీ ఇండస్ట్రీలో ఉన్నారా అనిపిస్తుంది. కొందరికి అసలు హిట్ లేకపోయినా కూడా అవకాశాల కోసం ఏళ్ల తరబడి సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతుంటారు. ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా, కష్టాలు పడిన కొందరు డైరెక్టర్లు కథలు చెబుతునే ఉంటారు. సినిమాలు తీస్తూనే ఉంటారు. దానికి ముఖ్య కారణం సినిమా మీద ఉన్న పిచ్చే.

ఎందుకంటే సినిమా కోసం పడిన కష్టాలన్నీ మరిచిపోయి.. మళ్లీ అందమైన క్షణాలను క్రియేట్ చేసేది కూడా ఆ సినిమానే. నిజానికి సినిమా స్టోరీ బాగుంటే.. అసలు సినిమాకు ప్రమోషన్లు కూడా అవసరం లేదు. ఎలాంటి పరిచయం ఓ వ్యక్తి తన డబ్బులతో చీకటి థియేటర్‌లో టికెట్ కొనుక్కొని కూర్చుని, డైరెక్టర్ రాసిన కథను చూసి నవ్వుతాడు.. ఆ పాత్రలతో ఏడుస్తాడు.. సన్నివేశాలకు మైమరిచిపోయి చప్పట్లు కొడతాడు. ఆ రెండు మూడు గంటల పాటు అతడు తన కష్టాలను, బాధలను మర్చిపోయి డైరెక్టర్ సృష్టించిన ప్రపంచంలో జీవిస్తాడు. బహుశా ఆ ఒక్క క్షణం ఇచ్చే ఆనందం కోసం ఏమో డైరెక్టర్లు ఎన్నో స్టోరీలు రాస్తుంటారు. ఫ్లాప్‌లు పడుతున్నా.. మళ్లీ సినిమా ప్రపంచంలోకే తిరిగి వస్తుంటారని డైరెక్టర్ కూచిపూడి వెంకట్ తెలిపారు.

తన మొదటి సినిమా నిర్మాత ఒకసారి ఓ అద్భుతమైన మాట చెప్పారని తెలిపారు. ఆయన అన్న ఆ మాటను నేను ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ప్రపంచంలో నిజమైన ఆత్మతృప్తిని ఇచ్చే సంపాదన రెండే విషయాల్లో ఉంది… ఒకటి నలుగురికి అన్నం పెట్టడం, రెండు నలుగురిని సంతోషపెట్టడం అని చెప్పారన్నారు. షాకింగ్‌గా అనిపించి అతను అడగ్గా.. ఇలా చెప్పారు. “నువ్వు వంట చేసి పెడితే, ఒకడి ఆకలి తీరుతుంది. అతడు కడుపు నిండా తిని సంతోషంగా నీకు డబ్బులు ఇస్తాడు. నువ్వు ఒక మంచి సినిమా తీస్తే, ప్రేక్షకుడు తన బాధలన్నీ మర్చిపోయి, హాయిగా నవ్వుకుని, ఏడ్చి, మనస్ఫూర్తిగా టికెట్ కొంటాడు. నువ్వు అతడి సంతోషం నుంచి డబ్బు సంపాదిస్తున్నావ్. అది నువ్వు ఎంతో గర్వంగా, తృప్తిగా అనుభవించగలిగే సంపాదన.” అని అన్నారు.

ఈ మాటలను తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నట్లు డైరెక్టర్ వెంకట్ తెలిపారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో మ్యాజిక్ జరుగుతోంది. కేవలం 62 రోజుల్లో ఆరు సినిమాలు గొప్ప విజయాన్ని అందుకున్నాయి. డైరెక్టర్ నందిని రెడ్డి ‘మా ఇంటి బంగారం’తో మొదలైన ఈ విజయాల పరంపర ప్రస్తుతం ఇరుముడి వద్దకు వచ్చింది. మా ఇంటి బంగారం తర్వాత ‘లెనిన్’తో మురళి కృష్ణ అబ్బూరు, ‘చెన్నై లవ్ స్టోరీ’ రవి నంబూరితో, ‘కొరియన్ కంకరాజు’తో మేర్లపాక గాంధీ, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’తో వెంకీ అట్లూరి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన శివ నిర్వాణ ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. 62 రోజుల్లో ఆరుగురు దర్శకులు తీసిన ఆరు డిఫరెంట్ స్టోరీస్ మూవీస్ హిట్ కొట్టాయి.

అయితే బయటి ప్రపంచానికి ఇవి కేవలం ఆరు హిట్ సినిమాలు కావచ్చు. కానీ సినిమా లోపల ఉన్న వాళ్లకి మాత్రం ఈ విజయాల వెనుక ఎంతటి సుదీర్ఘమైన నిరీక్షణ ఉందో అని డైరెక్టర్ వెంకట్ అన్నారు. ఒక్క సినిమా కోసం వందల నిద్రలేని రాత్రులు గడుపుతామని, మనస్సులో ఎవరికి చెప్పుకోని యుద్ధమే చేస్తుంటామన్నారు. ప్రస్తుతం ఓటీటీలు పెరిగిపోవడంతో థియేటర్లకు జనాలు ఎక్కువగా రావడం లేదు. దీంతో థియేటర్ వ్యవస్థ అంతా కూడా అంతరించిపోతుందని అనుకున్న సమయంలో ఈ ఆరు సినిమాలను హిట్ కొట్టించి ప్రేక్షకులు నిరూపించారని అన్నారు. మాకు మంచి కథ ఇవ్వండి.. తప్పకుండా థియేటర్లకు వస్తామని ప్రేక్షకులు నిరూపించారని తెలిపారు.

సినిమా అనేది వందల మంది కలిసి చేసే ఒక పెద్ద టీమ్‌వర్క్. నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అందరూ కలిసి పోరాడితేనే సినిమా సాధ్యమవుతుంది. కానీ అలెగ్జాండర్‌కు, అశోకుడికి ఎంతటి పెద్ద సైన్యాలు ఉన్నా చరిత్ర ఎప్పుడూ రాజునే గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే ఎటు వెళ్లాలో నిర్ణయించేది, ధైర్యంగా దారి చూపేది, యుద్ధంలో గెలుపైనా ఓటమైనా తన భుజాలపై మోసేది ఆ రాజు మాత్రమే. సినిమా అనే యుద్ధంలో దర్శకుడే ఆ రాజు! ఈ 62 రోజులు నిరూపించింది ఒక్కటే… కథలు బతికే ఉన్నాయి, థియేటర్లు బతికే ఉన్నాయి, సినిమా బతికే ఉంది.. ఎప్పటికీ సినీ ఇండస్ట్రీకి దర్శకుడే రాజు అని డైరెక్టర్ వెంకట్ అన్నారు.

Also Read : డిప్రెషన్‌లో ఉన్నా..అందుకే మాధురికి దగ్గరయ్యా : కొడుకు మీద ఒట్టేసి సంచలన విషయాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి!