
Agriculture Officer Srihari Death : బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి (ఏవో) నడవాటి శ్రీహరి అనుమానాస్పద మృతి ఉదంతం నెల్లూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల 15వ తేదీన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిన శ్రీహరి, తన బావమరిది కుడుముల హరికృష్ణతో కలిసి కారులో పెంచలకోనకు వెళ్లారు. తిరిగి వస్తున్న మార్గమధ్యంలో ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందినట్లు భావించినప్పటికీ, అది సహజ మరణం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దారుణ హత్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ దారుణానికి కోట్లాది రూపాయల ఆస్తి, నగదు వివాదాలే ప్రధాన కారణమని వెల్లడైంది. ఏవో శ్రీహరిని అమితంగా నమ్మించిన బావమరిది హరికృష్ణ, ఆయన నుంచి కోట్ల విలువైన ఆస్తులు, భారీగా అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. ఇటీవల శ్రీహరి నూతన ఇల్లు నిర్మించుకోవాలని భావించి, తాను ఇచ్చిన డబ్బు, ఆస్తులను తిరిగి ఇవ్వాలని కోరడంతో హరికృష్ణకు దుర్బుద్ధి పుట్టింది. ఆస్తులను తిరిగి ఇవ్వడం ఇష్టం లేక, బావను మట్టుబెట్టాలని పక్కా వ్యూహం రచించాడు.
హత్య ప్రణాళికలో భాగంగా హరికృష్ణ.. సోంపల్లి రవీంద్ర, బుచ్చింగారి యానాదయ్య అనే ఇద్దరు వ్యక్తులకు భారీగా డబ్బు ఆశ చూపి తనతో చేర్చుకున్నాడు. జూన్ 15న దైవదర్శనం నెపంతో శ్రీహరిని కారులో తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో చేజర్ల మండలం వద్ద కారును నిలిపాడు. ముందే అక్కడ సిద్ధంగా ఉన్న రవీంద్ర, యానాదిలు శ్రీహరిని కదలకుండా పట్టుకోగా, హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే తీవ్ర విషపూరిత ఇంజెక్షన్లను బావకు బలవంతంగా గుచ్చి దారుణంగా హత్య చేశాడు.
Also Read : ఎల్ బీ నగర్ లో ఉద్రిక్తత.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై దాడి
అనంతరం దీనిని గుండెపోటు మరణంగా చిత్రీకరించి, మృతదేహానికి హడావుడిగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే, శ్రీహరి శరీరంపై ఉన్న గాయాలు, దహనం వెనుక ఉన్న తొందరపాటుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో శ్రీహరి భార్య లావణ్య పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేయడంతో, ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ వేగవంతమైంది.
సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు ఈ కుట్రలో భాగస్వాములైన రవీంద్ర, యానాదయ్యలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. మరోవైపు, ప్రధాన నిందితుడు కుడుముల హరికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే, “తాను చనిపోతున్నానంటూ” హరికృష్ణ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన ఓ సెల్ఫీ వీడియో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనే కోణంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఈ కేసు విచారణలో స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు బయటపడటంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు హరికృష్ణతో సీఐ మాతంగి శ్రీనివాసులు డీల్ కుదుర్చుకున్నట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో డీజీపీ స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ సీఐ శ్రీనివాసులుతో పాటు స్థానిక ఎస్సైను విఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఎస్పీ అజిత ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ స్థాయిలోనే కాకుండా, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చెందిన ఏకంగా 23 మంది కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. ఒకే ఘటనలో, ఒకే పోలీస్ స్టేషన్కు చెందిన ఇంతమంది సిబ్బందిపై ఒకేసారి బదిలీ వేటు పడటం రాష్ట్ర పోలీస్ యంత్రాంగ చరిత్రలోనే ప్రథమమని చెప్పవచ్చు. ఈ చర్య జిల్లా పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఈ విచారణను వేగవంతం చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం అన్ని కోణాల్లో గాలిస్తున్నారు. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే హరికృష్ణ అరెస్టు అత్యంత కీలకమని, అతడు పట్టుబడితే మరిన్ని రహస్యాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Also Read : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు: ఉగ్ర కుట్రల మూలాలపై వేటు..









