
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (కేబినెట్) సమావేశం ముగిసిన అనంతరం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు , ప్రభుత్వ కార్యాచరణపై మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వ మంత్రులకు పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చేస్తున్న కుట్రలను, క్రిమినల్స్‌ను వెనకేసుకొచ్చే వారి వైఖరిని గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. క్రిమినల్స్ ని వెనకేసుకురావటం, వారికి వంత పాడుతూ రాజకీయం చేయడం ఒక్క వైసీపీకే చెల్లుతుందని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కర్నూలు ఘటన ప్రస్తావన.. కుల మీటింగ్‌లపై ఆగ్రహం:
ఇటీవల కర్నూలులో జరిగిన ఒక ఘటనను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఉదహరించారు. ఊరంతా ఏకగ్రీవంగా బహిష్కరించిన వ్యక్తులను కూడా వైసీపీ నాయకత్వం వెనకేసుకొచ్చి రాజకీయం చేయాలని చూడటం విచారకరమని సీఎం గుర్తుచేశారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా కుల మీటింగ్‌లు పెడుతూ, సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, వీటిని మంత్రులంతా క్షేత్రస్థాయిలో ధీటుగా తిప్పికొట్టాలని ఆదేశించారు. అదే సమయంలో, సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఆ విషయాన్ని బాధితుడి తల్లిదండ్రులు కూడా నమ్ముతుంటే, వైసీపీ మాత్రం దానిపై శవరాజకీయం చేస్తోందని ఈ భేటీలో మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కూటమి ఐక్యత ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలపై స్పందించాలి:
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్య ఐక్యతను కాపాడటంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కొందరు కావాలనే అనవసర విషయాల్లోకి, వివాదాల్లోకి లాగుతూ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మంత్రులకు వివరించారు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు, తమ శాఖ కాకపోయినా కూటమి ఐక్యతను చాటిచెప్పేలా మంత్రులంతా ఒకేతాటిపై నిలబడి గట్టిగా స్పందించాలని సూచించారు. ప్రతి మంత్రి కేవలం తమ సొంత శాఖలకే పరిమితం కాకుండా, అన్ని శాఖల పనితీరు ,ప్రభుత్వ విధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. తమ పరిధిలోని అంశం కాదని మౌనంగా కూర్చోకుండా, ప్రభుత్వంపై జరిగే ఎలాంటి దుష్ప్రచారాలనైనా తిప్పికొట్టాలన్నారు.
డీఎస్సీపై అసత్య ప్రచారాల ఖండన.. అభివృద్ధి పనుల ప్రకటన:
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ సహా వివిధ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను మంత్రులంతా సమర్థవంతంగా క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఇదే వేదికపై రాష్ట్రంలోని కీలక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా సీఎం వెల్లడించారు. జొన్నగిరి గ్రామాన్ని ‘స్వర్ణగిరి’ గ్రామంగా నామకరణం చేద్దామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రతిపాదించారు. రాయలసీమ నిరుద్యోగుల కల అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాబోయే జూలై 3వ తేదీన అధికారికంగా శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి, సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగుతుందని సీఎం మంత్రులతో స్పష్టం చేశారు.









