
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను అర్నబ్(Cyclone Arnab) ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడంతో కోస్తాంధ్ర తీవ్రంగా కంపించిపోతోంది. యానాం ప్రాంతానికి దక్షిణంగా, నరసాపురానికి సమీపంలో ఈ తుపాను భూభాగంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. తీరం దాటే క్రమంలో గంటకు కేవలం 3 కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో ప్రయాణించినప్పటికీ తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల ప్రచండ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి బాపట్ల మధ్య ప్రాంతాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read : అర్నబ్ తుఫాన్‌పై ఏపీ హై అలర్ట్.. రూ.27 కోట్లు రిలీజ్.. స్కూళ్లకు సెలవులు!
తుపాను ఉద్ధృ తిని బట్టి రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వేర్వేరు హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు అత్యంత భారీ వర్షాల సూచనతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో కూడా వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ఇచ్చారు. దీనికి తోడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను ధాటికి గోదావరి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల బీభత్సానికి అనేక చోట్ల వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో తీవ్ర విద్యుత్ విఘాతం ఏర్పడింది. కాకినాడ నగరం పరిధిలోని జగన్నాథపురం, గోలీలపేట, ఇందిరా నగర్, ముత్తా నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. నివాసాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. జగన్నాథపురంలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా జలమయం కావడంతో అక్కడి ప్రజలు భయంతో రెండో అంతస్తుకు చేరుకుని తలదాచుకున్నారు. సముద్ర ఉద్ధృతి తగ్గాలని ప్రార్థిస్తూ స్థానికులు గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. మరోవైపు కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం చింతనలంకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభం ఈదురుగాలులకు నేలకూలింది. నరసాపురం, పాలకొల్లు, అచంట ప్రాంతాల్లోనూ పెనుగాలులు వీచాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా పెరిగింది. ప్రచండ గాలులతో పాటు 36 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, 143 చోట్ల అతిభారీ వర్షాలు, 205 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో 26.1 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా విజయనగరం జిల్లా భోగాపురం, విశాఖ జిల్లా ముడసర్లోవలో 25.9 సెం.మీ. నమోదైంది. అనకాపల్లి జిల్లా తాడి, పరవాడలలో 24.5 సెం.మీ., సోమలింగంపాలెం, అచ్యుతాపురంలో 23.9 సెం.మీ., విశాఖ జిల్లా సింహాచలంలో 23.6 సెం.మీ., చామలపల్లెలో 23.5 సెం.మీ., విజయనగరం జిల్లా వేపాడలో 22.7 సెం.మీ., విశాఖ జిల్లా పద్మనాభపురంలో 22.5 సెం.మీ., విజయనగరం జిల్లా కొత్తవలసలో 22.3 సెం.మీ., అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెంలో 22.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Also Read : US ఎన్నికల్లో భారతీయుల హవా.. అభ్యర్థుల కోసం రూ.226 కోట్ల ఖర్చు









