Shabad Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ కథ ముగిసింది. జూలై 10న భార్య, పిల్లలతో సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసి పరారైన ఈ నరహంతకుడి మృతదేహం జులై 13న కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్ వద్ద లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహంపై ఉన్న దుస్తులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మరణించింది రాజ్‌కుమారేనని ప్రాథమికంగా నిర్ధారించారు. అతని శవం పక్కన పాయిజన్‌ బాటిల్‌ లభ్యం కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఒక పోక్సో ( ) కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన రాజ్‌కుమార్, ఆ కేసు విషయమై కక్ష పెంచుకుని మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మలను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన స్వగ్రామానికి వెళ్లి, కన్న పిల్లలతో పాటు భార్య సరిత గొంతు కోసి దారుణంగా చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఒకే రోజు గంటల వ్యవధిలో జరిగిన ఈ ఆరు హత్యల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.విచారణలో సరిత ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ తనకంటే ఆరేళ్లు పెద్దదైన సరితను 2018లో వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేసే అతడు బెట్టింగులు, జూదం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసగా మారి ఏకంగా రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. జల్సాలకు అలవాటుపడి ప్రతిరోజూ వేధిస్తుండటంతో తట్టుకోలేక భార్య సరిత విడాకులు అడిగింది. తన విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తోందని, విడాకులు అడిగిందనే కోపంతోనే ఆమెను, పిల్లలను అడ్డుతొలగించుకోవడానికి ముందే ప్లాన్ చేసి చంపేశాడు.

Also Read : ఏవో శ్రీహరి హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. సొంత బావమరిదే కుక్కలను చంపే ఇంజెక్షన్లతో..

నరహంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు, 14 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-బెంగళూరు హైవేలోని దాబాలు, లాడ్జీలు, బస్టాండ్లు,రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించారు. గాలింపు సమయంలో నిందితుడు సూర్యాపేట వైపు వెళ్లినట్లు వచ్చిన వార్తలు, రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోనూ, పోలీసు వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించిన రాజ్‌కుమార్, పోలీసులు తనను అదుపులోకి తీసుకునే లోపే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం సాగింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం రహస్యంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక మరణించాడని ప్రచారం సాగింది. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. ఈ క్రమంలోనే కొత్తూరు వద్ద అతడి మృతదేహం లభించినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన ఈ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందడంతో ఈ దారుణ కాండకు తెరపడినట్లయింది. అయితే, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఘటనకు సంబంధించి పోలీసులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. భార్య, పసి పిల్లలు, మరో ముగ్గురిని దారుణంగా పొట్టనబెట్టుకున్న హంతకుడు చివరికి శవమై తేలడం గమనార్హం.

Also Read : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ భుజానికి పూర్తయిన సర్జరీ

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.