Nagpur :  నాగ్‌పూర్‌లో ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి ఓ వ్యక్తి రూ.4 లక్షలు ఎత్తుకెళ్లాడు. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేవలం 30 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి మొత్తం రూ.4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగ్‌పూర్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో జరిగింది.

ఆ సమయంలో బ్యాంకులో సిబ్బంది తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి సాధారణ కస్టమర్‌లా బ్యాంకులోకి వచ్చాడు. నేరుగా నగదు కౌంటర్‌ దగ్గరకు వెళ్లాడు. ఎవరూ ఊహించని విధంగా తన దగ్గర దాచుకున్న ఎర్ర కారం పొడిని బయటకు తీసి బ్యాంకు సిబ్బంది కళ్లలో చల్లాడు. దీంతో సిబ్బందికి కళ్లు మండిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాక వారు భయంతో బయటకు పరుగులు తీశారు.

Also Read : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుడు ఎర్ర రంగు కుర్తా, నల్ల ప్యాజామా ధరించి కనిపించాడు. ముఖం మొత్తం కప్పుకున్న అతడు సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి అక్కడి నుంచి పరుగులు తీశాడు. సిబ్బంది భయంతో పరుగులు తీస్తుండటాన్ని గమనించిన నిందితుడు ఇదే అదనుగా తీసుకున్నాడు. నగదు కౌంటర్‌ నుంచి రూ.4 లక్షలు తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడు.

కొంతమంది బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ గార్డు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఉపయోగించుకుని నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బ్యాంకులోని సీసీ కెమెరాలతో పాటు బయట ఉన్న కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించారు.

సీసీ కెమెరాల్లో నిందితుడి వివరాలు, అతడు పారిపోయిన దారి పోలీసులకు స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. పెట్రోలింగ్‌ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. దోపిడీ జరిగిన కేవలం 30 నిమిషాల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి బ్యాంకు నుంచి తీసుకెళ్లిన మొత్తం రూ.4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : నేపాల్ వరదల్లో ఊహించని అద్భుతం.. సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ చైనా కార్మికుడు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.