
Mudragada Family: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ముద్రగడ బతికున్న సమయంలో ప్రభుత్వం ఆయనను సరిగ్గా గౌరవించలేదని, పలు రకాలుగా అవమానించారని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరణించాక అధికారిక గౌరవాలు, సానుభూతి ప్రదర్శించడం ఏమాత్రం అవసరం లేదని వారు స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని వైసీపీ నేత జక్కంపూడి రాజా మీడియాకు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం తన జీవితంలో అధికారం కోసం ఎప్పుడూ పాకులాడలేదని, ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి అని రాజా పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు, ప్రభుత్వం తరపున ఇచ్చే అధికారిక లాంఛనాలను వారు నిరాకరించారు. దీనితో ముద్రగడ అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల సమక్షంలోనే కొనసాగే అవకాశం ఉంది.
Also Read : ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కూతుర్ని అడ్డుకున్న అనుచరులు!
మరోవైపు, ముద్రగడ అంత్యక్రియల సమయంలో ఆయన కుమార్తె క్రాంతిని పద్మనాభం అనుచరులు అడ్డుకున్నారు. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ఆమెను వారు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల రక్షణతో ఆమె కిర్లంపూడి చేరుకున్నారు. దూరం నుంచే తండ్రిని చివరిసారి చూసుకున్న క్రాంతి, అనుచరుల నిరసనల మధ్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తండ్రిని చూసేందుకు వచ్చిన కుమార్తెపై అనుచరులు నినాదాలు చేయడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
ముద్రగడ 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత 1982లో టీడీపీలో చేరారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి, మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.
Also Read : ఏఓ శ్రీహరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్: నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య!









