Cyclone Arnab :  ఆర్నబ్‌ తుఫాన్ ఏపీని వణికించింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిశాయి. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలడంతో పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. విశాఖపట్నం పాత గోశాల సమీపంలో విద్యుత్తు స్తంభం కూలి ఓ మహిళ మృతి చెందారు. బాలాజీనగర్‌లోనూ విద్యుత్తు స్తంభం కూలడంతో మాధవి ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. చర్చి వద్ద చెట్టు విరిగిపడి చొక్కా కిషోర్‌ (45) మృతి చెందారు. బొండాడవారివీధిలో విద్యుత్తు స్తంభం కూలడంతో రాంబాబు (34) దుర్మరణం చెందారు. ఈదురుగాలులకు భీమవరంలో పలు దుకాణాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి.

కోనసీమ జిల్లాలోనూ తుఫాన్ విషాదాన్ని మిగిల్చింది. సఖినేటిపల్లి మండలం ప్రకాశ్‌పురంలో ఓ వృద్ధురాలు మృతి చెందారు. అదే జిల్లాలో ఈదురుగాలులు, వర్షానికి గుడిసె కూలడంతో కొల్లు వెంకాయమ్మ ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఈదురుగాలులకు విద్యుత్తు తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. ఉదయం ఇంటి ముందు ఉన్న విద్యుత్తు తీగలు ప్రమాదవశాత్తూ తగలడంతో ఓ మహిళ మృతి చెందారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బలమైన గాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రహదారులపై చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి.

Also Read : ఏపీలో మూడు.. తెలంగాణలో ఆరు.. రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

తుఫాన్ ప్రభావంతో వరి, ఉద్యాన పంటలు(పండ్లు, కూరగాయలు, పూలు) కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిన వివరాల ప్రకారం 70,900 హెక్టార్ల వరి పంట, 10,450 హెక్టార్ల ఉద్యాన పంటలు ప్రభావితమయ్యాయి. మొత్తంగా 81,350 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. తుఫాన్ తగ్గుముఖం పట్టినా.. పంట నష్టం, విద్యుత్తు, రహదారుల నష్టంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో నష్టం లెక్కలు తేలాల్సి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. రోడ్లపై పడిన చెట్లు, ఇతర అడ్డంకులను తొలగిస్తున్నారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు..

అర్నబ్‌ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 126 కి.మీ.కుపైగా రహదారులు దెబ్బతిన్నాయి. 9 కల్వర్టులు దెబ్బతినగా, ఇప్పటికే 6 కల్వర్టులను పునరుద్ధరించారు. రహదారులపై 1,058 చెట్లు నేలకూలగా, ఇప్పటివరకు 859 చెట్లను తొలగించినట్లు మంత్రి బీసీ జనార్దన్‌ తెలిపారు. చెట్లు కూలడంతో 57 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, 20 చోట్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 111.665 కి.మీ. రహదారులు దెబ్బతినగా, తూర్పుగోదావరి జిల్లాలో 14.5 కి.మీ. రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారుల పునరుద్ధరణకు మొత్తం రూ.59.45 కోట్లు అవసరమవుతాయని మంత్రి తెలిపారు. ఇందులో తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.9.18 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.50.27 కోట్లు అవసరమని వెల్లడించారు.

Also Read : US ఎన్నికల్లో భారతీయుల హవా.. అభ్యర్థుల కోసం రూ.226 కోట్ల ఖర్చు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.