
Trump blasts : ఇరాన్‌తో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ యూఎస్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడి మిలిటరీ దూకుడుకు బ్రేకులు వేయడమే లక్ష్యంగా ప్రతినిధుల సభ, సెనేట్ ఉమ్మడిగా ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ పరిణామంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా సెనేట్ తీసుకున్న ఈ నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం తన విదేశాంగ విధాన విధుల నిర్వహణను మరింత కష్టతరం చేసిందని ఆయన మండిపడ్డారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు యూఎస్ సెనేట్ ఈ నిర్ణయం ద్వారా సహాయం, ఓదార్పు అందించినట్లు అయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’ లో ట్రంప్ వరుస పోస్ట్‌లు చేస్తూ సెనేట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ ప్రస్తుతం పూర్తిగా బలహీనపడిందని, అమెరికా అడిగిన ప్రతిదానికీ లొంగిపోయే స్థితికి వచ్చిందని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత అమెరికాను చూసి ఇరాన్ గజగజలాడుతున్న తరుణంలో, ఏమాత్రం సమయం కాని సమయంలో అర్థం లేని ‘వార్ పవర్స్ యాక్ట్’ ఓటింగ్ పెట్టారని ఆరోపించారు. అమెరికా పార్లమెంటే శత్రుదేశానికి సంకేతాలు ఇస్తున్నట్లుగా ఈ తీర్మానం ఉందని ఆయన విమర్శించారు.
యూఎస్ సెనేట్‌లో ఈ తీర్మానంపై అత్యంత ఉత్కంఠభరితంగా ఓటింగ్ సాగింది. చివరికి ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు రావడంతో బిల్లు నెగ్గింది. అయితే, ఈ ఓటింగ్‌లో రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు కీలక సెనేటర్లు పార్టీ లైన్ దాటి డెమోక్రాట్లతో చేతులు కలపడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిని ‘రిపబ్లికన్ లూజర్స్’ అని సంబోధిస్తూ, వారు కేవలం ప్రచారం కోసమే ఇలాంటి ‘దేశభక్తి లేని పనులకు’ ఒడిగట్టారని మండిపడ్డారు.డెమోక్రాట్లకు మద్దతుగా ఓటు వేసిన ఆ నలుగురు అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు రాండ్ పాల్, సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్‌స్కీ, బిల్ కాసిడీలుగా గుర్తించారు. వీరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు, డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ జాన్ ఫెటర్‌మన్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం.
ఈ ప్రతిష్టాత్మక తీర్మానం సెనేట్‌లో సులువుగా నెగ్గడానికి కొన్ని రాజకీయ సమీకరణాలు కారణమయ్యాయి. ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్‌కానెల్, డేవ్ మెక్‌కార్మిక్‌లు ఓటింగ్‌కు హాజరుకాకపోవడం బిల్లు ఆమోదం పొందడానికి దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అంతకుముందే యూఎస్ ప్రతినిధుల సభ (House of Representatives) లో కూడా ఈ బిల్లు 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.ఈ తీర్మానం ప్రకారం.. కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ముందస్తు అనుమతి లేదా అధికారిక ప్రకటన లేకుండా ఇరాన్‌పై అధ్యక్షుడు ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదు. అంతేకాకుండా, ఇరాన్‌తో ఘర్షణ వాతావరణంలో ఉన్న అమెరికా సైనిక బలగాలను తక్షణమే అక్కడ నుండి ఉపసంహరించుకోవాలని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ జోక్యాన్ని పరిమితం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
రెండు సభలూ ఆమోదించిన ఈ తీర్మానం ఒక ‘కాంకరెంట్ రిజల్యూషన్’ (ఉమ్మడి తీర్మానం) కిందికి వస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, దీనిపై అధ్యక్షుడికి వీటో (Veto) చేసే అధికారం ఉండదు. ఇది అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే నేరుగా అమలులోకి వస్తుంది. అయితే, ఈ రకమైన తీర్మానాలకు పూర్తి స్థాయి చట్టపరమైన బలం ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ తీర్మానానికి పూర్తి స్థాయి చట్టపరమైన బలం లేదని వైట్ హౌస్ వర్గాలు కొట్టిపారేశాయి. ఇది కేవలం డెమోక్రాట్లు ఆడిన ఒక రాజకీయ చదరంగం, ప్రతీకార చర్య మాత్రమేనని అమెరికా అధ్యక్ష భవన అధికారులు కొట్టిపారేశారు. పైగా, గత ఏప్రిల్ 7 నాటి కాల్పుల విరమణతోనే ఇరాన్‌తో ఘర్షణలు ముగిశాయని, ప్రస్తుతం అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేనప్పుడు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే మాటకు అర్థమే లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
వైట్ హౌస్ వాదనను డెమోక్రాట్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ తీర్మానం దేశ అధ్యక్షుడి ఏకపక్ష మిలిటరీ నిర్ణయాలను కచ్చితంగా కట్టడి చేస్తుందని వారు నమ్ముతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో వైట్ హౌస్ లేదా ట్రంప్ యంత్రాంగం ఈ ఉమ్మడి తీర్మానాన్ని ఉల్లంఘించి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగితే, కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డెమోక్రాట్లు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది కాలంలోనే ఇరాన్ యుద్ధ అధికారాల పరిమితిపై అమెరికా సెనేట్ ఓటింగ్ జరపడం ఇది పదోసారి కావడం విశేషం. యుద్ధాలు ప్రకటించే విషయంలో, విదేశాల్లో సైనిక బలగాలను మోహరించే అంశంలో అమెరికా అధ్యక్షుడికి, కాంగ్రెస్‌కు మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న సుదీర్ఘ అధికార సమతుల్యత పోరాటానికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. చట్టబద్ధతపై వివాదాలు ఉన్నప్పటికీ, ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేయడానికి ప్రతిపక్షాలు, కొందరు స్వపక్ష నేతలు కలిసిన ఆడిన ఈ రాజకీయ వ్యూహం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.









