
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. అర్ధరాత్రి 11 గంటల తర్వాత కళింగపట్నానికి నైరుతి దిశలో ఈ తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకింది. అయితే తీరం దాటినప్పటికీ ఇది ఇంకా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Also Read : ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు.. ఎక్కడెక్కడ అంటే?
ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో పాటు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. రాబోయే 48 గంటల పాటు పరిస్థితులు అనుకూలంగా లేనందున.. ఈ నెల 27వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాన్ తీరం దాటినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ అయింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోకి వచ్చే విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు నేడు స్కూళ్లు, కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు తెలంగాణలోనూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో స్థానిక కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని, అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
Also Read : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్









