Delhi

Delhi : ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. అక్రమ సంబంధం కోసం ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చాలా ఘోరంగా చంపేసింది. ఆ తర్వాత ఎవరో దొంగలు వచ్చి చంపేశారని నమ్మించడానికి ఇళ్లంతా సామాన్లు పడేసి పెద్ద నాటకం ఆడింది. ఈ ఘటన ఆగస్టు 10వ తేదీ ఢిల్లీలోని రతియా మార్గ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మున్నా లాల్ (55) అనే బిల్డర్ తన ఇంట్లో రక్తం మడుగులో చనిపోయి పడి ఉన్నాడు. ఇంట్లో బీరువాలు, బట్టలు అన్నీ కిందపడి ఉన్నాయి. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

అతని భార్య మంజు (45) పోలీసుల ముందు ఏడుస్తూ.. ఉదయం లేచి చూసేసరికి భర్త చనిపోయి ఉన్నాడని, టెర్రస్ పైనుంచి దొంగలు వచ్చి చంపేసి ఉంటారని చెప్పింది. కానీ పోలీసులకు మాత్రం అక్కడ అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయాలు బయటపడ్డాయి. మున్నా లాల్‌కు ముందుగా అన్నంలో మత్తుమందు కలిపి ఇచ్చారని, ఆ తర్వాత ఆయన ప్రైవేట్ భాగాలపై కరెంట్ వైర్లు పెట్టి షాక్ ఇచ్చారని తేలింది. అంతటితో ఆగకుండా కర్రతో తలపై గట్టిగా కొట్టి, గొంతు నొక్కి చంపేశారు. చంపేశాక ఇంట్లోని రక్తాన్ని తుడిచేయడానికి ప్రయత్నించిన గుర్తులు కూడా పోలీసులకు కనిపించాయి. వీధిలోని సిసిటివి కెమెరాలు చూస్తే ఒక వ్యక్తి ముసుగు వేసుకుని రాత్రి ఇంట్లోకి వెళ్లడం తెల్లవారుజామున బయటకు రావడం రికార్డైంది.

పోలీసులు భార్య మంజును గట్టిగా నిలదీసి అడిగేసరికి అసలు నిజం చెప్పేసింది. మంజుకు చమన్ (20) అనే కుర్రాడితో తనకు అక్రమ సంబంధం ఉంది. భర్త సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, రోజు గొడవలు అవుతుండటంతో ఆయనను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. భర్తను చంపేస్తే అతడికి ఉన్న ఆస్తి అంతా వస్తుందని, ప్రియుడు చమన్‌కు రూ. 5 లక్షలు ఇస్తానని ఆశ చూపించింది.

ప్లాన్ లో భాగంగా ఆగస్టు 9 రాత్రి భర్త తినే తిండిలో మత్తుమందు కలిపారు. ఆయన స్పృహ తప్పి పడిపోయాక.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చి, కర్రతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. హత్య పూర్తయ్యాక మంజు ప్రియుడికి రూ. 20,000 చేతిలో పెట్టింది. ఆ తర్వాత దొంగలు వచ్చి చంపినట్లు కనిపించడానికి సామాన్లన్నీ కింద పడేశారు. ఈ కేసులో పోలీసులు భార్య మంజును, ప్రియుడు చమన్‌ను వారికి సహాయం చేసిన కిషన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ. 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం నాటకంతో తప్పించుకుందామని చూసిన భార్య చివరకు జైలు పాలైంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.