Suryapet Road Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read : హైదరాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌.. వెళ్లేవారికి తగ్గింపు… దిగే వారికి పెంపు

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా.. మరొకరి విషయం తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు స్థానికులు స్పందించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఎలూరు వైపు ప్రయాణిస్తున్న బస్సు దొరకుంట శివారులో ముందు వెళ్తున్న కంటైనర్‌ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.

కాగా, ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే తీవ్రంగా గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, మృతుల గుర్తింపు, క్షతగాత్రుల సంఖ్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్..? హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.