YouTuber Vaishnavi Husband :జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో నిందితునిగా ఉన్న ఆమె భర్త హరిబాబు ఈ రోజు హత్యకు గురయ్యాడు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాకు సమీపంలో హరిబాబును కారులో వచ్చిన దుండగులు కత్తితో నరికి చంపారు. హరిబాబును వెంబడిస్తూ వచ్చిన కారులోని వ్యక్తులు హరిబాబు ఒక పానీపూరి బండివద్దకు వెళ్లి వంగి నీళ్లు తాగుతుండగా కారునుంచి కత్తితో దిగిన ఒక యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి మెడపై నరికి చంపాడు. క్షణాల్లో జరిగిన ఈ అటాక్‌ నుంచి హరిబాబు తప్పించుకునే అవకాశం లేకపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. వచ్చిన వ్యక్తి అదే స్పీడులో కారులో పారిపోయాడు. వివరాల ప్రకారం…

నిజామాబాద్ లో సెప్టెంబర్ 17, గురువారం సాయంత్రం జరిగిన ఒక దారుణ హత్య ఇటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని, అటు జనాలను వణికించేసింది. ఆర్‌ఆర్ చౌరస్తాలో ఒక థియేటర్ సమీపంలోని కూరగాయలు అమ్మే ప్రాంతం… అక్కడ జనాల రద్దీ బాగానే ఉంది. సరిగ్గా అదే టైమ్‌కి ఒక కారు నెమ్మడిగా వచ్చి రోడ్డు పక్కన ఆగింది. రోడ్డుకు ఇటువైపున చిత్తరి హరిబాబు ఒక షాపు వద్ద వంగి నీళ్లు తాగుతుండగా కారులో నుంచి దిగిన ఒక వ్యక్తి హరిబాబును కత్తితో నడిరోడ్డుపైనే కిరాతకంగా చంపాడు. క్షణాల వ్యవధిలో హరిబాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు.

కారులో వచ్చి, క్షణాల్లో అటాక్ చేసి, అదే కారులో పరారయ్యాడు నిందితుడు. అసలు ఈ హరిబాబు ఎవరు? ఎందుకు నడిరోడ్డుపై ఇలా నరికి చంపారు? అని పోలీసులు ఆరా తీస్తే.. దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటికి వచ్చాయి. మృతుడు చిత్తరి హరిబాబు ఎవరో కాదు.. కొద్ది నెలల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్తే! అప్పట్లో తన భార్య వైష్ణవిని అత్యంత కిరాతకంగా చంపిన అదే హరిబాబు.. ఇప్పుడు నిజామాబాద్‌ నది రోడ్డు పై ఇలా దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. కాగా హత్య చేసింది ఒకరే అయినప్పటికీ కారులో మరో ఇద్దరు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

అసలు వైష్ణవి హత్య వెనుక ఏం జరిగింది?
“జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, రాణి దంపతుల కూతురు వైష్ణవి వయసు జస్ట్ 19 సంవత్సరాలు! అయ్యప్పగుట్టకు చెందిన హరిబాబుతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించారు, లోకాన్ని లెక్కచేయలేదు.. ‘నువ్వు లేకపోతే నేను లేదు’ అంటూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో ఇద్దరూ వేరుగా ఉంటూ హ్యాపీగా సంసారం సాగించారు. వైష్ణవికి సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. ‘వైషు అమ్మ’ (Vaishu Amma) పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది. రోజువారీ వంటలు, హోమ్ టూర్లు, భర్తతో సరదాలు.. ఇలా తన లైఫ్‌లోని ప్రతి మూమెంట్‌ని షేర్ చేస్తూ ఉంటే.. జనాలు ఆమెను విపరీతంగా ఇష్టపడ్డారు. చూస్తుండగానే ఆ ఛానెల్‌కి 50 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు వచ్చేసారు. షార్ట్స్ అయితే మిలియన్లలో వ్యూస్ తెచ్చుకున్నాయి. మెల్లగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు! ఎప్పుడైతే హరిబాబు కుటుంబసభ్యులు వీళ్ళ జీవితంలోకి ఎంటరయ్యారో.. అసలు సమస్యలు అక్కడే మొదలయ్యాయి. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి చాలా అభ్యంతరం పెట్టారు, ఒప్పుకోలేదు. అత్తగారింట్లోనే ఉంటున్న హరిబాబుపై వాళ్ళ కుటుంబం నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ‘ఆస్తి కావాలి, అదనపు కట్నం తెవాలి’ అంటూ వైష్ణవిని మానసికంగా, శారీరకంగా వేధించడం స్టార్ట్ చేశారు. కూతురి కాపురం చక్కగా ఉండాలని వైష్ణవి తల్లిదండ్రులు కట్నంగా రూ. 5 లక్షలతో పాటు కొంత భూమి, బంగారం కూడా రాసిచ్చారు. అయినా ఆ కక్కుర్తి మొగుడికి, వాళ్ళ కుటుంబానికి బుద్ధి రాలేదు!”

“ఇక అసలు రోజు వచ్చేసింది! సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. హరిబాబు, వైష్ణవిల మధ్య అదనపు కట్నం కోసం పెద్ద గొడవ జరిగింది. వైష్ణవి అప్పటికి 4 నెలల గర్భవతి! కడుపులో పసిబిడ్డ ఉందని కూడా చూడకుండా ఆ రాక్షసుడు తెగబడ్డాడు. ఇంట్లోని కత్తిని తీసి వైష్ణవి గొంతు నులిమి, విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు! తెల్లవారేసరికి ఆ గర్భవతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. కళ్లముందే కూతురు శవాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చిన ఏడుపులు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ దారుణం జరిగాక హరిబాబు పరారయ్యాడు. కానీ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి, కోరుట్ల శివారులోనే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్య 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో కోరుట్లలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది! ‘మా బిడ్డను పొట్టనబెట్టుకున్న ఆ హరిబాబును, వాళ్ళ కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి.. ఉరితీయాలి’ అంటూ వైష్ణవి బంధువులు, జాతీయ రహదారిపై కలప దుంగలకు నిప్పంటించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి.. ఈ హత్యలో కేవలం హరిబాబు మాత్రమే కాకుండా, అతనికి సపోర్ట్ చేసిన అతని తల్లి చిత్తారి లక్ష్మి, ఇద్దరు అన్నలు చిత్తారి అశోక్, చిత్తారి ఆనంద్ ప్రమేయం ఉందని తేల్చారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు వాడిన కత్తిని, పల్సర్ బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హరిబాబు హత్యకు గురికావడం సంచలనంగా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.