
Emraan Hashmi : బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. ఆయనకు H1N1 వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సమాచారం. ఇమ్రాన్ హష్మీ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాంచీతో పాటు పలు ప్రాంతాల్లో సినిమా పనుల కోసం ప్రయాణాలు చేసిన ఆయన.. ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో H1N1 పాజిటివ్‌గా తేలింది.
ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ విశ్రాంతి తీసుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ఈ విషయంపై ఇమ్రాన్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. అయితే బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు ఇమ్రాన్ తన అభిమానులకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ హష్మీ నటించిన అవారాపన్ 2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన సినిమాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు రూ.40.50 కోట్ల వసూళ్లు సాధించింది. అదే సమయంలో తమిళ్ విశ్వనాథ్ & సన్స్ రూ.26 కోట్లు, బట్వారా 1947 రూ.16.20 కోట్లు, స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే రూ.12 కోట్లు, DC సినిమా రూ.6.30 కోట్ల వసూళ్లు సాధించాయి.
నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ‘అవారాపన్ 2’ను విశేష్ భట్.. విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. 2007లో వచ్చిన అవారాపన్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో పాటు దిశా పటానీ, షబానా ఆజ్మీ నటించారు. చాలా కాలం తర్వాత ఇమ్రాన్ హష్మీ పాత స్టైల్ మళ్లీ కనిపించడంతో ఆయన అభిమానులు సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని సమాచారం. దీంతో అవారాపన్ 2 ఊహించని విధంగా హిట్‌గా నిలిచింది.









