Shruti Haasan : పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పి, దాని గురించి సమాజంలో ఉన్న అవగాహన లేమిపై నటి శ్రుతిహాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీరియడ్స్‌ బాధ ఎలా ఉంటుందో పురుషులకు కూడా తెలిస్తే బాగుంటుందని తాను ఎన్నోసార్లు కోరుకున్నానని చెప్పారు. అంతేకాదు.. ఉద్యోగాల్లో పీరియడ్ లీవ్‌ కూడా ఒక సాధారణ సెలవుగా కాకుండా, వర్క్‌ కాంట్రాక్టుల్లోనే భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సోహా అలీఖాన్‌ నిర్వహించే పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్‌.. పీరియడ్స్‌ గురించి సమాజంలో ఉన్న అపోహలు, తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి మాట్లాడారు. పురుషులకు కూడా పీరియడ్స్‌ వస్తే బాగుంటుందని నేను ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థించాను. అప్పుడు మన కాంట్రాక్టుల్లోనే పీరియడ్‌ హాలిడేస్‌ ఉండేవి అంటూ సరదాగా చెప్పారు.

తనకు PCOS ఉన్న కారణంగా పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని శ్రుతిహాసన్‌ వెల్లడించారు. తన కెరీర్‌ ప్రారంభ రోజుల్లో పీరియడ్స్‌ గురించి పెద్దగా మాట్లాడేవారు కాదని చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడితే ఎదుటివాళ్లు ఎలా తీసుకుంటారో అనే ఆలోచనతో తాను కూడా మౌనంగా ఉండిపోయేదాన్నని తెలిపారు.

అయితే ఓసారి తన పరిస్థితి గురించి ఓ దర్శకుడికి చెప్పినప్పుడు ఆయన స్పందన తన ఆలోచనను మార్చిందని శ్రుతి చెప్పారు. నేను మొదటిసారి ఒక దర్శకుడికి చెప్పాను. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమెకు కూడా చాలా తీవ్రమైన క్రాంప్స్‌ ఉంటాయని ఆయన చెప్పారు. అప్పుడే ఈ విషయం గురించి మాట్లాడితే పరిస్థితి ఎలా మారుతుందో అర్థమైంది అని వివరించారు.

తన సహనటుడు మోకాలికి శస్త్రచికిత్స జరిగిందని చెప్పినప్పుడు.. అందుకు తగ్గట్టుగా షూటింగ్‌ షెడ్యూల్‌ను మార్చుకునే అవకాశం ఉంటుందని అందరూ అర్థం చేసుకున్నారని, అదే విధంగా నాకు పీరియడ్స్‌ ఉన్నాయి అని కూడా చెప్పగలిగితే తన పరిస్థితిని అర్థం చేసుకుని పని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని శ్రుతిహాసన్‌ తెలిపారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. శ్రుతిహాసన్‌ చివరిసారిగా 2025లో వచ్చిన కూలీ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి ట్రైన్‌ సినిమాలో నటిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఆకాశంలో ఒక తార లోనూ కనిపించనున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.