Swara Bhasker :  బాలీవుడ్ నటి స్వర భాస్కర్ 2011లో ఓ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టారు. ఓ సినిమా దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. అప్పట్లో తనకు జరుగుతున్నది లైంగిక వేధింపులని కూడా గుర్తించలేకపోయానని చెప్పారు. సినిమా రంగంలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢిలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆ సమయంలో దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరు తనకు ఇబ్బందిగా అనిపించినా, దాన్ని లైంగిక వేధింపులుగా గుర్తించలేకపోయానని చెప్పారు. ఎందుకంటే ఆ వ్యక్తి తనను ఎలాంటి శారీరకంగా తాకలేదని వివరించారు.

అప్పటికే ఆమె తను వెడ్స్ మను సినిమాలో నటించారు. అయినప్పటికీ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. తనకు అప్పుడు సొంతంగా మేనేజర్ లేరు. తన సమస్యను చెప్పుకునేందుకు దగ్గరగా ఎవరూ లేరు. సినిమా రంగంలో పెద్దగా పరిచయాలు కూడా లేవు. దీంతో ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నానని చెప్పారు. కొన్నేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం మొదలైనప్పుడు ఇతర మహిళలు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టడం చూశానని స్వర తెలిపారు. వారి మాటలు చదివిన తర్వాత తనకు కూడా జరిగినది వేధింపులేనని అర్థమైందని చెప్పారు.

ఆ సినిమా షూటింగ్ మొత్తం 56 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే దర్శకుడి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయని స్వర చెప్పారు. అప్పటికే సినిమా షూటింగ్ మొదలవడంతో మధ్యలో సినిమా వదిలి వెళ్లాలని అనుకోలేదని తెలిపారు. తన కెరీర్‌ను నిలబెట్టుకోవాలని, మంచి అవకాశాలను వదులుకోకూడదని భావించినట్లు చెప్పారు. మహిళలు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి బయటకు చెప్పాలా? లేక వచ్చిన పని అవకాశాన్ని కాపాడుకోవాలా? అనే పరిస్థితిలో పడుతుంటారని ఆమె అన్నారు. పని చేయాలనే కోరిక ఉండటం తప్పు కాదని, కెరీర్‌పై ఆశలు పెట్టుకోవడం కూడా సహజమేనని చెప్పారు.

చివరకు తనకు ఎదురవుతున్న సమస్యను సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు చెప్పాలని స్వర నిర్ణయించుకున్నారు. ఆయన తనకు అండగా నిలిచారని, సమస్యను పరిష్కరించేందుకు సహాయం చేశారని తెలిపారు. దీంతో మిగిలిన షూటింగ్‌ను కొంత ప్రశాంతంగా పూర్తి చేయగలిగానని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, చివరకు ఆయనే తన మేనేజర్‌గా మారారని స్వర వెల్లడించారు. సినిమా రంగంలోకి కొత్తగా వచ్చే యువతులు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మౌనంగా ఉండకూడదని స్వర సూచించారు. తమకు ఇబ్బందిగా అనిపించే విషయాలను గుర్తించాలని, నమ్మకమైన వారితో మాట్లాడాలని చెప్పారు. అవసరమైతే సహాయం తీసుకోవాలని, తప్పుగా ప్రవర్తించే వారిని వెంటనే ప్రశ్నించాలని సూచించారు.

ఇక స్వర భాస్కర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. రాజకీయ నాయకుడు ఫహాద్ అహ్మద్‌ను ఆమె 2023 జనవరి 6న ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఫిబ్రవరి 16న తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023 సెప్టెంబర్‌లో ఈ దంపతులకు పాప జన్మించింది. తమ కుమార్తెకు రాబియా అని పేరు పెట్టారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.