
Kangana Ranaut : బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరి మధ్య కొద్దికాలంగా మాటల యుద్ధం నడుస్తుండగా, తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. కంగనాతో తనకు ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేదని, వివాదాలు ప్రారంభం కావడానికి ముందు కూడా ఆమెను కలవలేదని స్పష్టం చేశారు. కంగనా మాట్లాడే తీరు, ఆమె అభిప్రాయాలు ఆమె పెంపకాన్ని బట్టి ఉంటాయని, తన అభిప్రాయాలు తన పెంపకాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. దీనిపై ఎవరికి వారు స్వయంగా ఒక అంచనాకు రావచ్చని తాప్సీ తెలిపారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఘాటుగా స్పందించారు. తాప్సీ తన సినిమా ప్రమోషన్ల కోసం తన పేరును వాడుకుంటోందని ఆరోపించారు. తాప్సీ తన తల్లిదండ్రుల పెంపకాన్ని కించపరిచేలా మాట్లాడి అన్ని హద్దులు దాటిందని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు తనను ఒరిజినల్‌గా పెంచారని, మరి తాప్సీ తల్లిదండ్రులు ఎందుకు ఆమెను ఒక ‘చీప్ కాపీ’లా పుట్టించలేకపోయారని ప్రశ్నించారు. తాప్సీ చేసే ప్రయత్నాల చూస్తే జాలేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
2019లో కంగనా సోదరి రంగోలీ చందేల్.. తాప్సీని చీప్ కాపీ అని అనడంతో వీరిద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత 2020లో నెపోటిజం వివాదం నడుస్తున్న సమయంలో కంగనా.. తాప్సీ, స్వరా భాస్కర్లను ‘బీ-గ్రేడ్ నటీమణులు’ అంటూ విమర్శించారు. దీనిపై తాప్సీ స్పందిస్తూ.. బయటి వ్యక్తులమంతా ఐక్యంగా ఉండాలి తప్ప ఒకరినొకరు విమర్శించుకోకూడదని బదులిచ్చారు.
ఇదిలా ఉంటే, రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు స్పందించిన తాప్సీ.. తాను రాజకీయాలకు సరిపోనని, తన డిఎన్ఏలోనే అది లేదని స్పష్టం చేశారు. తాను కేవలం ఒక పౌరురాలిగా మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తానని తెలిపారు. ప్రస్తుతం తాప్సీ గంధారి అనే రివెంజ్ డ్రామా చిత్రంలో నటిస్తుండగా, ఇది సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.









