India : సెప్టెంబర్ 1 నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఒక మంచి వెసులుబాటు రానుంది. ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల దగ్గర బోర్డింగ్ పాస్‌లపై ఎలాంటి స్టాంపు వేయించుకోవాల్సిన పనిలేదని అధికారులు చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేసే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ దేశంలోని అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో ఈ నిబంధనను ఎత్తేయాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులు తమ ఫోన్లలో ఉండే డిజిటల్ లేదా ఈ-బోర్డింగ్ పాస్‌లను చూపించి నేరుగా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరి దగ్గరైనా పేపర్ ప్రింట్ ఉంటే అది కూడా పనిచేస్తుంది, కాకపోతే ఇకపై దాని మీద ఎలాంటి స్టాంపు వేయరు.

సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని ఏఎన్ఐ, పీటీఐ వార్తా సంస్థలు వెల్లడించాయి. దేశంలోని అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల కౌంటర్లకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయి. పేపర్ బోర్డింగ్ పాస్‌లు ఇకపై పని చేయవని దీని అర్థం కాదు. మీ వద్ద పేపర్ పాస్ ఉంటే దానిని కౌంటర్ వద్ద చూపించవచ్చు, కాకపోతే అధికారులు దానిపై స్టాంపు మాత్రం వేయరు. కాబట్టి ప్రయాణికులు తమకు ఏది సౌకర్యంగా ఉంటే ఫోన్లలో డిజిటల్ పాస్ లేదా పేపర్ ప్రింట్.. ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు.

బోర్డింగ్ పాస్‌లపై స్టాంపులు వేయడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతోందని ఇమ్మిగ్రేషన్ శాఖ గుర్తించింది. కొన్నిసార్లు స్టాంపు సరిగ్గా పడక దానిపై ఉన్న వివరాలు కూడా సరిగ్గా కనిపించట్లేదని అధికారులు చెప్పారు. అందుకే ఈ పద్ధతిని పూర్తిగా మార్చేస్తున్నట్లు తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.