
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణం:పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం.. మూడో రోజు కలెక్షన్లలో దూసుకుపోయింది. దీంతో మూడు రోజులు పూర్తయ్యేసరికి భారతీయ మార్కెట్లో ఈ సినిమా రూ.182.70 కోట్ల నెట్ (గ్రాస్ రూ. 218.25 కోట్లు) వసూలు చేసి రూ. 200 కోట్ల వైపు శరవేగంగా పరుగులు పెడుతోంది.
మూడు రోజుల వసూళ్లలో భాగంగా మొదటి రోజు రూ. 64.85 కోట్ల నెట్ వసూళ్లతో అద్భుత ఆరంభాన్ని అందుకుంది. రెండో రోజు రూ.48.05 కోట్లు రాబట్టింది. మూడో రోజు దేశ వ్యాప్తంగా రూ.69.80 కోట్ల నెట్ వసూళ్లు (గ్రాస్ రూ.83.45 కోట్లు) సాధించింది.
మరోవైపు దేశీయ మార్కెట్‌నే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజు ఓవర్సీస్లో సుమారు రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ మొత్తం వసూళ్లు రూ. 157.25 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా.. ఇండియా + ఓవర్సీస్ కలిపి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 375.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అదరగొట్టింది.
మూడోరోజు భాషల వారీగా చూసుకుంటే.. హిందీలో రూ. 53 కోట్లు, కన్నడలో రూ. 6.30 కోట్లు, తెలుగులో రూ. 6.00 కోట్లు, తమిళంలో రూ. 2.50 కోట్లు, మలయాళంలో రూ. 2.00 కోట్లు వచ్చాయి.
నితేష్ తివారీ ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో రావణుడి పాత్రలో యష్ యాక్టింగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో అరుణ్ గోవిల్, శోభన, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కపూర్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.









